కేసీఆరే నాకు స్ఫూర్తి.. హరీష్ రావు నాకు వార్నింగ్ ఇవ్వలేదు

కొత్తగూడెంలో ప్రజల సమస్యలు తెలుసుకోడానికి గడప గడపకు గడల అనే కార్యక్రమం చేపట్టానని తెలిపారు శ్రీనివాసరావు. తన పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని చెప్పారు. తనంటే గిట్టనివారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement
Update: 2023-08-21 07:47 GMT

తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరు ఇటీవల మీడియా, సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తున్నారని అంటున్నారు. ఆ వాదనకు బలాన్నిస్తూ డాక్టర్ జీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆయన జనంలోకి వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై ఇటీవల ఓ ప్రచారం మొదలైంది. మంత్రి హరీష్ రావు ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది డాక్టర్ జి.శ్రీనివాసరావు ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఆయన తన సేవా కార్యక్రమాలను ఆ నియోజకవర్గంలో విస్తృతం చేశారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా అప్పుడప్పుడు పొలిటికల్ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాదయాత్ర కూడా మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తానంటున్నారు. అయితే ఆయన పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రి హరీష్ రావు ఆయనకు వార్నింగ్ ఇచ్చారనే వార్త ఇందులో ఒకటి. కొత్తగూడెంలో పొలిటికల్ కామెంట్లు చేయొద్దని హరీష్ రావు హెచ్చరించారని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తల్ని శ్రీనివాసరావు కొట్టిపారేశారు. కొత్తగూడెంలో పొలిటికల్ కామెంట్లు చేయొద్దని మంత్రి హరీష్ రావు తనకు సూచించారనే వార్తలు అవాస్తవం అన్నారు. ఫోన్ లో కూడా తనకు హరీష్ రావు క్లాస్ తీసుకోలేదని, అలాంటి తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని కోరారు.

గడప గడపకు గడల..

కొత్తగూడెంలో ప్రజల సమస్యలు తెలుసుకోడానికి గడప గడపకు గడల అనే కార్యక్రమం చేపట్టానని తెలిపారు శ్రీనివాసరావు. తన పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని చెప్పారు. తనంటే గిట్టనివారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి ప్రచారాలను మీడియా మిత్రులు నమ్మొద్దని కోరారు. ఎవరెంత అడ్డుపడినా.. కొత్తగూడెంలో డా.జీఎస్‌ఆర్ ట్రస్ట్ సేవలు మాత్రం ఆపేది లేదన్నారు గడల. 

Tags:    
Advertisement

Similar News