తెలంగాణలో వర్ష బీభత్సం.. ఏడుగురు మృతి

నాగర్‌కర్నూలు, మేడ్చల్ జిల్లాల్లో మాత్రం విషాదాన్ని నింపింది. నాగర్‌కర్నూలు జిల్లాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మేడ్చల్ జిల్లాలో ఇద్దరు చనిపోయారు.

Advertisement
Update: 2024-05-26 18:01 GMT

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌, వనస్థలిపురం, ఉప్పల్‌, నాగోల్‌, సరూర్‌నగర్‌, కీసర, ECIL ప్రాంతాల్లో కురిసిన వర్షం వేడి నుంచి ఉపశమనం కలిగించగా.. నాగర్‌కర్నూలు, మేడ్చల్ జిల్లాల్లో మాత్రం విషాదాన్ని నింపింది. నాగర్‌కర్నూలు జిల్లాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మేడ్చల్ జిల్లాలో ఇద్దరు చనిపోయారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల‌కొరిగాయి.

నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో ఈదురుగాలుల నిర్మాణంలో ఉన్న కోళ్ల ఫాం షెడ్డు కూలింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు కార్మికులు, యజమాని, పదేళ్ల చిన్నారి ఉన్నారు. ఇక ఇదే జిల్లాలోని తెలకపల్లి మండలంలో పిడుగుపాటుకు 12 ఏళ్ల లక్ష్మణ్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

మేడ్చల్ జిల్లా కీసర మండలంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఊహించని ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వెళ్తున్న నాగిరెడ్డి, రాంరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులపై ఒక్కసారిగా చెట్టు విరిగి పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Tags:    
Advertisement

Similar News