Chiranjeevi: పెద్దరికమూ వద్దు.. కుర్చీలూ వద్దు.. చిరంజీవి కామెంట్స్

ఇండస్ట్రీకి తన అవసరం ఉన్న ప్రతిసారి తప్పకుండా భుజం కాస్తా అని ఆయన అన్నారు. సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీలో నిర్మించిన నూతన గృహ సముదాయాన్ని గురువారం చిరంజీవి ప్రారంభించారు.

Advertisement
Update: 2022-12-29 09:26 GMT

తెలుగు సినీ ఇండస్ట్రీకి దర్శకుడు దాసరి నారాయణరావు దశాబ్దాల పాటు పెద్ద దిక్కుగా ఉండి కళాకారుల అన్ని సమస్యలు పరిష్కరించేవారు. అయితే ఆయన మరణం తర్వాత సినీ పెద్ద ఎవరు? అనే ప్రశ్న తలెత్తింది. అయితే ఆ తర్వాత కరోనా సమయంలో నటీనటులందరికీ అండగా నిలబడడం, ఏపీలో సినిమా టికెట్ల ధరలు తక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించడం వంటి కారణాలతో చిరంజీవి సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలబడితే బాగుంటుందని పలువురు నటీనటులు, దర్శకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనైతే అందర్నీ కలుపుకొని వెళ్తూ.. అందరి సమస్యలు పరిష్కరిస్తారని.. దర్శకుడు రాజమౌళి సహా పలువురు నటీనటులు వ్యాఖ్యలు చేశారు.

అయితే అదే సమయంలో సీనియర్ హీరో మోహన్ బాబు దాసరి నారాయణరావు తర్వాత మరెవరికీ సినీ పెద్ద అని అనిపించుకునే అర్హత లేదని పలుమార్లు కామెంట్స్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి కల్పించుకొని తనను ఎవరూ సినీ పెద్ద అని సంబోధించవద్దని.. అలా పిలిపించుకోవడం తనకు ఇష్టం లేదని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమకు అవసరం అయినప్పుడల్లా అండగా నిలబడతానని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు మరోసారి సినీ పెద్దరికంపై చిరంజీవి కామెంట్స్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో పెద్దరికం అనుభవించాలనే ఉద్దేశం తనకు లేదని, తనకు ఎలాంటి కుర్చీలూ వద్దని వ్యాఖ్యానించారు. కానీ ఇండస్ట్రీకి తన అవసరం ఉన్న ప్రతిసారి తప్పకుండా భుజం కాస్తా అని ఆయన అన్నారు. సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీలో నిర్మించిన నూతన గృహ సముదాయాన్ని గురువారం చిరంజీవి ప్రారంభించారు. లబ్ధిదారులకు పట్టాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనిల్ దొరై సారథ్యంలో కొత్త కమిటీ నూతన గృహ సముదాయానికి సంబంధించి అన్ని పనులు సజావుగా పూర్తి చేసినట్లు సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ తెలిపినట్లు చెప్పారు. సి.కళ్యాణ్, తమ్మారెడ్డి తనను ప్రతిసారి సినీ పెద్ద అని అంటుంటారని, నిజానికి వాళ్లు నాకంటే చిన్నవాళ్ళు అనిపించుకోవడం కోసం నన్ను పెద్ద అంటున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. సినీ కార్మికులు, కళాకారులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతానని చిరంజీవి భరోసా ఇచ్చారు. పెద్దరికం అనుభవించాలని ఆలోచన తనకు లేనట్లు మరోసారి స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News