భారీ బడ్జెట్ సినిమాల ఓటీటీ హక్కులకు ఇక్కట్లేనా?

భారీ-బడ్జెట్ హిందీ, తెలుగు సినిమా డీల్స్ ని లాక్ చేయడం పట్ల ఓటీటీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. హిందీ, తెలుగు బిగ్ స్టార్ సినిమాల మీద స్ట్రీమింగ్ కంపెనీల మోజు తీరిందా అని ప్రశ్న వేసుకుంటే అవుననే సమాధానం వస్తుంది.

Advertisement
Update: 2024-05-08 10:41 GMT

భారీ-బడ్జెట్ హిందీ, తెలుగు సినిమా డీల్స్ ని లాక్ చేయడం పట్ల ఓటీటీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. హిందీ, తెలుగు బిగ్ స్టార్ సినిమాల మీద స్ట్రీమింగ్ కంపెనీల మోజు తీరిందా అని ప్రశ్న వేసుకుంటే అవుననే సమాధానం వస్తుంది. కారణం, వీటిని కొనుగోలు చేయడానికి భారీ మొత్తాలు చెల్లించినప్పటికీ చందాదారుల్ని ఆకర్షించడంలో విఫలమవుతున్నాయి కంపెనీలు. ‘సాలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి భారీ థియేట్రికల్ విడుదలలకి ఓటీటీ పరిశ్రమలో కొనుగోలుదారుల్ని కనుగొనడం చాలా కష్టంగా మారింది. స్ట్రీమింగ్ కంపెనీలు అగ్ర తారలు నటించిన సినిమాల కొనుగోలు ధరల్ని వాటి బాక్సాఫీసు పనితీరుతో ముడిపెట్టాలని కోరుకుంటున్నట్టు ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. చిన్న సినిమాల విషయంలో ఇదే పద్ధతిని అమల్లో పెట్టారు. దీంతో భారీ-బడ్జెట్ సినిమాల ఓటీటీ రేట్లు 20-30% పడిపోయాయి. ఇలా ఒక స్టార్ నటించిన గత సినిమా బాక్సాఫీసు పనితీరుని బట్టి కొత్త సినిమా ఓటీటీ రేటుని నిర్ణయించే పరిస్థితికి వచ్చారు.

దీంతో థియేట్రికల్ విడుదలకి ముందు స్ట్రీమింగ్ భాగస్వామిని పొందే పద్ధతి నుంచి వైదొలిగి, ఇప్పుడు ఓటీటీ ఒప్పందాలు లేకుండానే థియేటర్‌లలోకి సినిమాలు వస్తున్నాయి, బాలీవుడ్ లో ఈ మార్పు ఎక్కువగా కన్పిస్తోంది. కొన్ని నెలలుగా అనేక హిందీ సినిమాలు ఓటీటీ భాగస్వాములు లేకుండానే థియేట్రికల్ విడుదలలయ్యాయి. ఆ తర్వాత కూడా ఇంకా ఏ ఓటీటీల్లోనూ ఈ సినిమాలు కనిపించడం లేదు.

థియేటర్లలో విడుదలైన తర్వాత నిర్దిష్ట ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించిన కొన్ని భారీ బడ్జెట్ హిందీ సినిమాలు ఆ స్ట్రీమింగ్ లోకే రావడం లేదు. బాక్సాఫీసు వైఫల్యాలు చూసి ఓటీటీ కంపెనీలు ఈ ఒప్పందాల నుంచి వెనక్కి తగ్గుతున్నాయి. టైగర్ ష్రాఫ్ నటించిన ‘గణపత్’, ‘ది లేడీ కిల్లర్’ రెండూ నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్‌ అవ్వాల్సింది ఇంతవరకూ అతీగతీ లేదు.

స్ట్రీమింగ్ కంపెనీలు ఇప్పుడు మార్చుకున్న వ్యూహం ఏమిటంటే, ఒక స్టార్ మునుపటి సినిమా బాక్సాఫీసు పనితీరు ఆధారంగా కొత్త సినిమా ఓటీటీ రేటుని నిర్ణయించడం. థియేట్రికల్ విడుదలకి ముందు కమిట్ అయిన మొత్తంలో కొంత శాతాన్ని కంపెనీ అడ్వాన్సుగా చెల్లించినా. ఆ తర్వాత ఒప్పందాలలోని కొన్ని క్లాజులు చూపించి ఎప్పుడైనా మొత్తం డీల్ ని రద్దు చేసే పరిస్థితి కూడా నిర్మాతల కెదురవుతోంది. ఇక ఏ చిన్న తరహా సినిమాలని కూడా స్ట్రీమింగ్ కంపెనీలు పరిగణన లోకే తీసుకోవడమే లేదు.

భారీ బడ్జెట్ సినిమాలని నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి బహుళ జాతీయ కంపెనీలు స్ట్రీమింగ్ చేస్తాయి. కాబట్టి కొనుగోళ్ళ వ్యవహారం గురించి వాటి అంతర్జాతీయ ఉన్నతాధికారులకి భారత ఎగ్జిక్యూటివ్ సమర్థించే మార్గమే లేదు. ఇష్టారాజ్యంగా రేట్లు నిర్ణయించి రిస్కు తీసుకోలేరు. అందుకని నిర్మాతలకి కొత్త ఆంక్షలు.

మరొకటేమిటంటే, స్ట్రీమింగ్ బూమ్ ఇప్పుడు నెమ్మదించింది, సబ్‌స్క్రిప్షన్‌లు లేదా అడ్వర్టైజింగ్‌లు ఆశించినంతగా టేకాఫ్ కావడం లేదు. ప్రస్తుతం కనీసం 40-50 తమిళ భాషా సినిమాలు అమ్ముడుపోకుండా పడి వున్నట్టు తెలుస్తోంది. తెలుగు సినిమాలు కూడా ఇదే సంఖ్యలో వున్నాయి. ఫలానా సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే...అని పదే పదే తేదీలు మారుస్తూ ప్రకటనలు ఇచ్చుకోక తప్పడం లేదు.

ముందస్తు ఒప్పందాలు, అడ్వాన్సు చెల్లింపులు, సినిమా ప్రారంభంలో స్ట్రీమింగ్ పార్టనర్ ఫలానా అని వేసుకోవడాలూ ఇకపైన కష్టంగానే మారవచ్చు. ఇవన్నీ అలసత్వానికి దారి తీయించే ఆకర్షణలు. దీనివల్ల సినిమా నిర్మాణం పై శ్రద్ధ, థియేటర్లో ప్రేక్షకులకి కనీస స్థాయి హిట్ అందివ్వాలన్న కమిట్ మెంట్ లేకుండా పోతున్నాయి. ముందు ఈ రెండూ సవ్యంగా జరిగితే, అప్పుడు ఓటీటీల ముందు సినిమా పెట్టనప్పుడు -ఎంతీస్తారు? అని అడగగలిగే బార్గెయినింగ్ పవర్ వస్తుంది. ఈ పవర్ ని సమకూర్చుకోకుండా ప్రాకులాడి ప్రయోజనం లేదు.

Tags:    
Advertisement

Similar News