Prasanna Vadanam Review: ప్రసన్న వదనం మూవీ రివ్యూ! {2/5}

Prasanna Vadanam Movie Review: ఇటీవల ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్’ తర్వాత సుహాస్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రసన్న వదనం’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

Advertisement
Update: 2024-05-06 11:37 GMT

చిత్రం: ప్రసన్న వదనం

రచన -దర్శకత్వం : అర్జున్ వైకే

తారాగణం : సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్, నితిన్ ప్రసన్న, హర్ష వర్ధన్, వైవా హర్ష తదితరులు

సంగీతం : విజయ్ బుల్గానిన్, : ఛాయాగ్రహణం : ఎస్.చంద్రశేఖరన్

నిర్మాతలు : నిర్మాత: మణికంఠ, ప్రసాద రెడ్డి

విడుదల : మే 3, 2024

రేటింగ్: 2/5

ఇటీవల ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్’ తర్వాత సుహాస్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రసన్న వదనం’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ప్రపంచ సినిమాల్లోనే అరుదైన కథా వస్తువుతో కొత్త దర్శకుడు అర్జున్ వైకే సుహాస్ ని ఒప్పించుకుని సినిమా తీసి ప్రేక్షకుల తీర్పు కోసం ముందుంచాడు. తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్ అంటేనే భయపడే రోజులు నడుస్తున్నాయి. వచ్చింది వచ్చినట్టు ఎటో వెళ్ళిపోతోంది. అయినా దీని క్రాఫ్ట్ ని నేర్చుకునే మాటే లేదు. ఒకొక్కరూ ఒక్కో హిచ్ కాక్ లా ఫీలై పోవడమే. హిచ్ కాకులు కాకుల్లా వచ్చి వాలుతోంటే ప్రేక్షకులు ఎడం చేత్తో దూరంగా తోలేస్తున్నారు. ఎన్నని తోలుతారు? ఇక కాకులు అగాల్సిన సమయం వచ్చిందేమో. ఈ పరిస్థితుల్లో ‘ప్రసన్న వదనం’ అలా ఆగాల్సిన సస్పెన్స్ థ్రిల్లరేనా కాదా తెలుసుకుందాం...

కథ

సూర్య ( సుహాస్ ) రేడియో జాకీ (ఆర్జే) గా పని చేస్తూంటాడు. గతంలో ఒక ప్రమాదంలో మనుషుల్ని గుర్తు పట్టే శక్తిని కోల్పోతాడు. అరుదైన ఫేస్ బ్లయిండ్ నెస్ అనే రుగ్మతకి లోనవుతాడు. మనుషుల ముఖాల్ని గుర్తు పట్టలేడు. గొంతులు కూడా గుర్తించ లేడు. అతడికో మిత్రుడు (వైవా హర్ష) వుంటాడు. అతడికి మాత్రమే ఈ విషయం చెప్తాడు. ఇలాటి ఇతడికి రెండు మూడు చోట్ల ఆద్య (పాయల్ రాధాకృష్ణ) తగిలి ఆమె మీద ప్రేమ పెంచుకుంటాడు. ఇలావుండగా, ఒకరోజు నడి రోడ్డు మీద యాక్సిడెంట్ ని చూస్తాడు. యాక్సిడెంట్ లా అన్పించే ఆ సంఘటనలో ఒకడు ఒకమ్మాయిని లారీ కింద తోసేయడాన్ని చూస్తాడు. దీన్ని పోలీసులకి చెప్తాడు.

ఎస్సై (నితిన్ ప్రసన్న), ఏసీపీ వైదేహీ (రాశీ సింగ్) ఫేస్ బ్లయిండ్ నెస్ తో వున్న సూర్య చెప్పే వివరాలతో అప్రమత్తమవుతారు. చనిపోయిన అమ్మాయి ఎవరు? ఆమెని ఎవరు, ఎందుకు చంపారు? పోను పోనూ ఈ కేసులో సూర్య ఎలా ఇరుక్కుని పోలీసుల నుంచి పారిపోవడం మొదలెట్టాడు? తన రుగ్మతతో హంతకుల్ని ఎలా పట్టుకోగల్గి నిర్దోషిగా బయటపడ్డాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ప్రోసోప్రగ్నోషా (Prosopagnosia) లేదా ఫేస్ బ్లయిండ్ నెస్ అనేది మెదడు ప్రక్రియకి సంబంధించిన రుగ్మత. దీని వల్ల సొంత ముఖంతో బాటు ఇతరుల ముఖాలు కూడా గుర్తు పట్టలేరు. గొంతులు కూడా గుర్తించలేరు. ఏవైనా కారణాల వల్ల మెదడు దెబ్బతినడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి చికిత్స లేదు. దీని మీద హాలీవుడ్ నుంచి ‘ఫేసెస్ ఇన్ ది క్రౌడ్’ (2011) అనే సస్పెన్స్ థ్రిల్లర్, ‘ఇన్ వివిడ్ డిటైల్’ (2007) అనే లవ్ స్టోరీ వచ్చాయి. ఈ రెండు సినిమాలూ ప్రస్తుత ‘ప్రసన్నవదనం’ లో వున్న సస్పెన్స్ థ్రిల్లర్ కథని, ప్రేమ కథనీ ఎలా ఎంత చక్కగా, ఉత్కంఠ భరితంగా మల్చవచ్చో తెలియ జేస్తాయి. కొత్త యువ దర్శకుడు ఈ పరిశీలన లేకుండా పాత మూస విధానంలో సినిమా తీసేశాడు.

పేరుకే ఫేస్ బ్లయిండ్ నెస్ తో కథ. దీన్ని హీరో పాత్రకి ఆపాదించకుండా, కథకీ ఆపాదించకుండా పైపైన నడిపేశాడు. ఒక కొత్త కాన్సెప్ట్ ని వృధా చేశాడు. ఈ కథలో వున్న అతిపెద్ద లోపమేమిటంటే, హత్య చేస్తూండగా చూసిన ఫేస్ బ్లయిండ్ నెస్ హీరోని హంతకుడు చంపాలని వెంటపడడం. సెకండాఫ్ పూర్తిగా ఇదే కథ. ఫేస్ బ్లయిండ్ నెస్ తో వున్న వ్యక్తి సాక్ష్యాన్ని ఏ కోర్టూ తీసుకోదు. అలాంటప్పుడు వాడ్ని చంపాలనుకోవడ మెందుకు? ఎంచక్కా వాడితోనే దోస్తీ చేస్తూ తిరగొచ్చు కదా?ఈ ప్రశ్న వేసుకుంటే సెకండాఫ్ సినిమాయే లేదు.

ఇలా సిల్లీ కథ చేసేసి సుహాస్ మీద వేస్తే చెల్లుతుందా? అందుకే కలెక్షన్స్ రిస్కులో పడ్డాయి. అసలు సస్పెన్స్ థిల్లర్స్ కి కొన్ని జానర్ మర్యాదలుంటాయి. తీసుకున్న పాయింటుకి యాక్షన్ రియాక్షన్లతో కూడిన సస్పెన్స్, థ్రిల్స్, ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్, యాక్షన్, డైలమా, టెంపో, ట్రెండీ టేకింగ్, స్పీడు వగైరా. ఇవేవీ లేకుండా నీరసంగా, నత్త నడకన, మధ్య మధ్యలో జానర్ మర్యాద తప్పి లవ్ ట్రాక్, సాంగ్స్, పెళ్ళి చూపులు, ఇంకో బోరు కొట్టే సబ్ ప్లాట్ ...ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ అనే ప్రక్రియలో ఇమడని ఎన్నో పాత మూస సీన్లు ఇరికించేశారు.

ఫస్టాఫ్ హీరోయిన్ తో ట్రాక్ నడుపుతూ మధ్యలో హత్య చూపించారు. ఆ తర్వాత హీరో దాన్ని మర్చిపోయినట్టు మళ్ళీ హీరోయిన్ తో ట్రాకు నడిపారు. ఇంటర్వెల్లో మాత్రం కిల్లర్ ఎవరో హీరోకి తెలియకుండా ప్రేక్షకులకి ఓపెన్ చేసేశారు. ఈ కథతో చేసిన మంచి పని ఇదొక్కటే. లేకపోతే అలవాటుగా చివరి వరకూ కిల్లర్ ని సీక్రేట్ గా వుంచి ఎండ్ సస్పెన్స్ కథలతో తీసి సినిమాల్ని ఫ్లాఫ్ చేస్తున్నారు.

ఇలా మధ్యలో కిల్లర్ ని ఓపెన్ చేయడం వల్ల ఎండ్ సస్పెన్స్ ప్రమాదం తప్పి- ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు చేస్తున్నట్టుగా -మధ్యలో కిల్లర్ ని ప్రేక్షకులకి రివీల్ చేసేసి- సినిమా నిలబడేందుకు ఉపయోగపడే సీన్ టు సీన్ సస్పెన్స్ కథనానికి బాగానే పూనుకున్నారు. అంటే ఇక నుంచీ సెకండాఫ్ లో కిల్లర్ తో హీరోకి ఎలుకా పిల్లీ చెలగాటం యాక్షన్ స్టోరీ అన్నమాట!

కానీ మళ్ళీ సెకండాఫ్ లో ఫస్టాఫ్ లాగే ఈ అసలు కథ వదిలేసి హీరోయిన్ తో ట్రాకు, ఇంకో కుటుంబపు గొడవలు, ఇంకేవో కథలు, అప్పుడప్పుడు మాత్రం హీరోని చంపడానికి ప్రయత్నించే సీన్లూ.... చివరికి ఒక ట్విస్టుతో హీరో కిల్లర్ ని చంపే ముగింపూ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు.

ఇందులో ఎక్కడా ఫేస్ బ్లయిండ్ నెస్ పాయింటు ప్లే అవదు. ఇది లేకుండా కూడా ఈ కథ చేయ వచ్చు. అసలు ఈ పాయింటు- అంట్ ముఖాల్ని గుర్తుపట్టలేని వాడి సాక్ష్యం పనికి రానప్పుడు, వాడు అంధుడితో సమానమైనప్పుడు, వెంటపడి వాడ్ని చంపాలని ప్రయత్నించే కథే అర్ధం లేనిది.

నటనలు- సాంకేతికాలు

ఈ సినిమా ప్రధాన సమస్య ఏమిటంటే హీరో సుహాస్ పాత్రచిత్రణ అర్ధం పర్ధం లేకుండా వుండడం. అతను రేడియో మిర్చీ ఎఫ్ఎంలో పనిచేసే ఆర్జే అయినప్పుడు ఆర్జే లక్షణాలు ఒక్కటీ వుండవు. సగటు నిరుద్యోగి ప్రవర్తనతో భయపడుతూ భయపడుతూ, పిరికి పిరికిగా వుంటాడు. ఆర్జేలు మాటల ప్రవాహంతో రేడియో శ్రోతల్లో ఉత్సాహం నింపుతూ, తమపట్ల క్రేజ్ పెంచుకుని పాపులర్ వ్యక్తులై వుంటారు. కానీ సుహాస్ దీనికి భిన్నంగా పోలీసులు కొడితే గానీ ఐడీ చూపించుకుని తను ఆర్జే అని చెప్పుకోడు!

ఒక హత్య వంటి సంఘటన చూసిన ఆర్జే కార్య నిర్వహణ ఎలా వుంటుంది? వెంటనే ఎఫ్ఎంనే అస్త్రంగా చేసుకుని ప్రజలకి సమాచారాన్ని చేరవేసి పోలీసుల్ని పరుగులు పెట్టిస్తాడు. మీడియా వ్యక్తిగా పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుని డ్రైవ్ చేస్తాడు. కానీ సుహాస్ మాత్రం తనని చూసి ప్రేక్షకులు అయ్యోపాపమని సానుభూతి చెందాలన్నట్టు ప్రవరిస్తాడు. ఇంకోసారి పోలీస్ స్టేషన్ కెళ్ళి చేతులు కట్టుకుని నిలడితే ఏసీపీ చూసి, ‘ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి?”అంటుంది. ఎంత అవమానం! ‘ఎవరితను?’ అని కాస్టేబుల్ ని అడుగుతుంది. ఎంత షేమ్ ఆర్జే హీరో క్యారక్టర్ కి!

‘ఒక సీన్లో ‘టెన్షన్ వచ్చి అక్కడ్నుంచి పారిపోయాను. నేనింటికి వెళ్ళాలంటే నా మీద ఎటాక్ చేస్తారని భయంగా వుంది’ అని ఫ్రెండ్ కి చెప్పుకుంటాడు! ఇతనేం హీరో? హాస్పిటల్ సీన్లో ఆగంతకులు వచ్చి చంపాలని ప్రయత్నిస్తే సుహాస్ ని పోలీసు వచ్చి కాపాడాల్సి వస్తుంది! ఇదేం హీరోయిజం?

సమస్య దర్శకుడితో వుంది. యాక్టివ్ క్యారక్టర్, పాసివ్ క్యారక్టర్ తేడాలు తెలీక డైరెక్టర్లు అయిపోతున్నారు. కథానాయకుడన్నాక కథని నడిపే యాక్టివ్ పాత్ర కాకుండా, కథని నడపలేని పాసివ్ క్యారక్టర్ గా దద్దమ్మని చేసి సినిమాని నాశనం చేశాడు. ఈ క్యారక్టర్ కి గొప్పగా ప్రోసోప్రగ్నోషా ఒకటి!

హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ ఫార్ములా పాత్ర. తను ఎవరో ఏం చేస్తూంటుందో తెలీదు. తన ముఖం గుర్తు పట్టని హీరోని ప్రేమిస్తూ వుంటుంది. దీనికి పరిష్కారం చూపించాలని కూడా ప్రయత్నించకుండా సుఖాంతం చేశాడు. ఫేస్ బ్లయిండ్ నెస్ తో క్రైమ్ కథ సరిగా లేదు, ప్రేమ కథా సరిగా లేదు.

ఎస్సై పాత్రలో నితిన్ ప్రసన్న, ఏసీపీ పాత్రలో రాశీ సింగ్ మూస పోలీసు పాత్రలు, నటనలు. హీరో ఫ్రెండ్ గా ఫస్టాఫ్ లో మధ్యలో అదృశ్యమై సెకండాఫ్ మధ్యలో వస్తాడు. డేట్లు కుదరలేదేమో.

ఇక సంగీతం గానీ, ఛాయాగ్రహణం వంటి సాంకేతికాలు గానీ థ్రిల్లర్ చూస్తున్నట్టు లేవు. హీరోకున్న ఫేస్ బ్లయిండ్ నెస్ ని టెక్నికల్ గా చూపించే ప్రయత్నం కూడా చేయలేదు. అతడి కంటికి మనుషుల రూపాలు ఎలా కనిపిస్తాయీ విజువల్స్ వేసి ప్రేక్షకుల అనుభవంలోకి తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఫేస్ బ్లయిండ్ నెస్ బాధితుడికి మనుషుల ముఖాలెలా కనపడతాయో ప్రేక్షకులకి చూపించకపోతే అతడితో ఎలా కనెక్ట్ అవుతారు.

1990 లో గీతాకృష్ణ తీసిన ‘కోకిల’ లో హీరో నరేష్ కి నేత్ర మార్పిడి చికిత్సతర్వాత అతడికి కన్పించే దృశ్యాలెలా వుంటాయి? చనిపోయిన వ్యక్తి కళ్ళు అమర్చిన తర్వాత అతడ్ని చంపిన హంతకుడు నరేష్ కెలా కన్పిస్తూంటాడు? ఇలా మానసిక లోకాన్ని ఆవిష్కరించాలని లేకపోతే ఎందుకు ఇలాటి సినిమా తీసినట్టు?


Full View


Tags:    
Advertisement

Similar News