ఏపీలో భారీ స్కాం- వైసీపీ ఎంపీ పిల్లి

ఏపీలో ధాన్యం కొనుగోలులో భారీ కుంభకోణం జరుగుతోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. రైతుల నుంచి ఒక్కో బస్తాపై 200 రూపాయలను దోచేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు, అధికారులు కలిసి రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోచేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. కానీ ఎక్కడా బయటపడకుండా కుంభకోణం చేస్తున్నారని విమర్శించారు. ముందుగా రైతుల నుంచి దళారుల ద్వారా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయిస్తున్నారని.. ఆ తర్వాత మిల్లర్లు కొందరు […]

Advertisement
Update: 2022-05-18 20:53 GMT

ఏపీలో ధాన్యం కొనుగోలులో భారీ కుంభకోణం జరుగుతోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. రైతుల నుంచి ఒక్కో బస్తాపై 200 రూపాయలను దోచేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు, అధికారులు కలిసి రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోచేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. కానీ ఎక్కడా బయటపడకుండా కుంభకోణం చేస్తున్నారని విమర్శించారు.

ముందుగా రైతుల నుంచి దళారుల ద్వారా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయిస్తున్నారని.. ఆ తర్వాత మిల్లర్లు కొందరు వ్యక్తుల పేర్లతో జాబితాను తెచ్చి అధికారులకు ఇచ్చి అవే పేర్లతో ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు జత చేయిస్తున్నారని వివరించారు. సగం రైతు పేరున చూపి.. మిగిలిన సగం ధాన్యాన్ని ఇతర వ్యక్తుల పేర్లతో నమోదు చేయించి, ప్రభుత్వానికి అమ్మేసి బస్తాపై కనీసం 200 దోచేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. ఇందుకు తన దగ్గర పక్కా ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఈ కుంభకోణంపై సీఐడీ చేత విచారణ జరిపించాల్సిందిగా సీఎంను తాను కోరుతానన్నారు.

ధాన్యం అమ్మిన వారిలో 17 వేల మంది రైతుల వివరాలు జిల్లాలో దొరకడం లేదని అధికారులు వివరించగా.. అవన్నీ మిల్లర్లు ఎక్కించిన తప్పుడు పేర్లు అని ఎంపీ వ్యాఖ్యానించారు. ఈ కుంభకోణం వివరాలు బయటకు రావాలంటే ప్రతి గ్రామంలో ఎవరు ఎంత ధాన్యం అమ్మారనేది చాటింపు వేసి ఆరా తీయాలని.. అప్పుడు అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు.

అయిదెకరాల్లో పండిన ధాన్యాన్ని మూడు రోజుల పాటు ఎండబెట్టానని.. రైతు భరోసా కేంద్రానికి వెళ్తే ఈ తిప్పలు నీవు పడలేవు గానీ వెళ్లి బయటి వ్యక్తులకే అమ్ముకో అంటూ అధికారులు సలహా ఇచ్చారని మాన్యం గోపాలకృష్ణ అనే రైతు మీడియాకు వివరించారు. ఆర్‌బీకేల్లో సంచులు కూడా ఇవ్వడం లేదన్నారు. అందుకే కమీషన్‌దారులకే ధాన్యం అమ్ముకుంటున్నామని వివరించారు.

ఆర్‌బీకే కేంద్రాల్లో ప్రభుత్వానికి ధాన్యం విక్రయిస్తే.. ఆ సొమ్ము చెల్లింపు రెండుమూడు నెలలకు గానీ జరగడం లేదు. ఇది కూడా రైతులు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఆర్‌బీకే కేంద్రాలు ఉన్నప్పటికీ అక్కడి పరిస్థితులను ఎదుర్కొలేక.. 90 శాతం మంది రైతులు రాష్ట్రంలో తమ ధాన్యాన్ని దళారులకే అమ్ముకుంటున్నారు. వారు నూక, తేమ అంటూ రకరకాల కారణాలతో బస్తాపై 200 వరకు తగ్గించి కొంటున్నారు. తిరిగి ఆ ధాన్యాన్ని వ్యాపారులు, మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై ప్రభుత్వానికి అధిక ధరకు అమ్మి లాభపడుతున్నారు. మధ్యలో రైతు కుదేలైపోతున్నాడు. పర్యవేక్షణ లోపంతోనే ఈ పరిస్థితి.

Tags:    
Advertisement

Similar News