2014 మేనిఫెస్టో.. చంద్రబాబు మోసాలకు సజీవ సాక్ష్యం

తన మోసాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో 2014 మేనిఫెస్టోని గూగుల్ కి కూడా అందకుండా మాయం చేశారు బాబు. కానీ అక్కడక్కడా ఆ సాక్ష్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి.

Advertisement
Update: 2024-04-29 11:34 GMT

చంద్రబాబు ఎంత మోసగాడో, ఎన్ని అబద్ధాలు ఆడాడో, ఎంతగా ప్రజల్ని నమ్మించి వంచించాడో చెప్పడానికి 2014 టీడీపీ మేనిఫెస్టోయే పెద్ద ఉదాహరణ. ఆ మోసాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో ఆ తర్వాత దాన్ని గూగుల్ కి కూడా అందకుండా మాయం చేశారు బాబు. కానీ అక్కడక్కడా ఆ సాక్ష్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి. దాని ప్రకారం బాబు ద్రోహం ఏ స్థాయిలో ఉందో ఓసారి మీరే చూడండి.




2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం, మేనిఫెస్టోలో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ. జగన్ తాను రుణమాఫీ చేయలేనని చెప్పేశారు, చంద్రబాబు తాను చేస్తానన్నారు. ఇంకేముంది రైతులంతా బాబుకి మద్దతు తెలిపారు, ఓట్లువేసి గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చాక బాబు ఆ రైతుల్ని దారుణంగా వంచించారు. మేనిఫెస్టో ప్రకారం రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా, బాబు చేసిన మాఫీ కేవలం 24వేల కోట్ల రూపాయలు. అంటే రైతులు చేసిన అప్పులకు కనీసం వడ్డీ కూడా మాఫీ కాలేదన్నమాట. అందులోనూ విడతల వారీగా నిధుల విడుదల అంటూ కనికట్టు చేశారు. చివర్లో 4, 5 విడతల నిధులు లబ్ధిదారులకు జమ చేయకుండానే ఎన్నికలొచ్చాయి. బాబు దారుణ ఓటమి చవిచూశారు.

రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు, ప్రభుత్వంలోకి వచ్చాక ఆ ఊసే లేదు. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి రుణాలిప్పిస్తామన్నారు కానీ చేయలేదు. డ్వాక్రా రుణాల మాఫీ అన్నారు కానీ చేయలేదు, చివరిగా 2019 ఎన్నికల ముందు పసుపు-కుంకుమ అంటూ డ్వాక్రా మహిళల్ని మభ్యపెట్టాలని చూశారు కానీ ఆ పథకం పారలేదు. మేనిఫెస్టోలో మహిళలకు భద్రత అనే హామీ ఉంది, కానీ టీడీపీ హయాంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ తో ఎంతోమంది మహిళల జీవితాలు బుగ్గిపాలయ్యాయి. ఓ మహిళా ఎమ్మార్వోని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని జుట్టుపట్టుకుని ఈడ్చారు. అలాంటి ఉదాహరణలు కోకొల్లలు.

మద్యం బెల్ట్ షాపులు రద్దు చేస్తామని 2014 మేనిఫెస్టోలో పేర్కొన్న చంద్రబాబు ఆ దిశగా కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. ఆడబిడ్డ పేరుతో రూ.30వేలు డిపాజిట్ హామీ కూడా అమలు కాలేదు. పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తామని మొహం చాటేశారు. పేదలకు 3సెంట్లలో ఇళ్లు నిర్మిస్తామన్నారు, చివరకు టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టినా ఏ ఒక్కటీ పూర్తికాలేదు, లబ్ధిదారులెవరికీ అవి అందలేదు. ఆరోగ్యశ్రీని మెరుగుపరచకపోగా నిర్వీర్యం చేశారు. హైదరాబాద్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు కాకుండా చేశారు చంద్రబాబు. ఉద్యోగులకు క్యాష్ లెస్ వైద్యం కూడా అందకుండా చేశారు.

పండంటి బిడ్డకు రూ.10వేలు అన్నారు కానీ ఇవ్వలేదు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో ఒకటి రెండు చోట్ల ఆ పథకం అమలు చేసి మమ అనిపించారు. రూ.10వేల కోట్లతో బీసీలకు బడ్జెట్ కేటాయింపులన్నారు, చివరకు తుస్సుమనిపించారు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 33.5 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అంటూ మేనిఫెస్టోలో కబుర్లు చెప్పారు కానీ, తర్వాత అమలు చేయలేదు. చేనేత కార్మికులకు వెయ్యి కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి అన్నారు, బడ్జెట్ లో ఏటా వెయ్యికోట్ల కేటాయింపులన్నారు. ఆ రెండూ జరగలేదు. పవర్ లూమ్స్ రుణమాఫీ కూడా మేనిఫెస్టో హామీగానే మిగిలిపోయింది. బ్రాహ్మణులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు, రూ.500కోట్లతో బ్రాహ్మణ నిధి అని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మోసం చేశారు చంద్రబాబు.

కాపులకు ప్రతి ఏటా రూ.వెయ్యికోట్లు ఇస్తామన్నారు. ఐదేళ్లలో 5వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా.. మొత్తంగా 1500 కోట్ల రూపాయలు విదిల్చి చేతులు దులుపుకున్నారు. ఇంటర్ విద్యార్థులకు బస్ పాస్ లు కూడా ఇవ్వలేదు. కాలేజీ స్టూడెంట్స్ కి ఉచితంగా ట్యాబ్ లు ఇస్తామని మోసం చేశారు.

బాబు వస్తే జాబు అన్నారు కానీ, లక్షల్లో ఖాళీలున్నా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. రూ.10వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కానీ ఐదేళ్లు కాలం గడిపి చివర్లో రూ.2వేలతో సరిపెట్టారు. అది కూడా టీడీపీకి అనుకూలంగా ఉండే అతి కొద్ది మందికే ఈ భృతి అందింది. చంద్రబాబు హయాంలో జాబ్ క్యాలెండర్ అనేది ఓ భారీ స్కామ్. రాష్ట్రంలో 6 లక్షలకు పైగా ఉద్యోగులుండగా.. వారి సంఖ్యను 4 లక్షలకు కుదించారు. లక్షా 42వేల ఖాళీలు ఉండగా, వాటిని 70వేలకు పరిమితం చేసి, అందులో 20వేల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి, చివరకు 2వేల పోస్ట్ లకు మాత్రమే నోటిఫికేెషన్లు ఇచ్చి మోసం చేశారు. నిరుద్యోగులకు రూ.50లక్షల వరకు రుణం అన్నారు కానీ ఇవ్వలేదు. మెగా డీఎస్సీ అంటూ మోసం చేశారు.

చంద్రబాబు మోసాల చిట్టా ఇది. పదే పదే సంపూర్ణ మ‌ద్య‌నిషేధం అమలు చేయలేదంటూ లాజిక్ తీస్తున్న చంద్రబాబుని ఈ మోసాలపై నిలదీస్తే తట్టుకోగలరా..? 2019లో ఆయన్ను ఎవరూ నమ్మలేదు, 2024లో కూడా చంద్రబాబుని ఎందుకు నమ్మాలి..? 2014 మోసాలే రిపీట్ చేయరు అనడానికి గ్యారెంటీ ఏంటి. ఇటువైపు 99 శాతం మేనిఫెస్టో హామీలని అమలు చేసిన జగన్ మరోసారి ధీమాగా 2024లో అమలు సాధ్యమయ్యే హామీలతోనే కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇప్పుడు చెప్పండి... జనం ఏవైపు ఉండాలి..? నమ్మించి గొంతుకోసే చంద్రబాబువైపా..? నిజాయితీగా హామీలు అమలు చేసే జగన్ వైపా..?

Tags:    
Advertisement

Similar News