జనరంజకంగా జగన్‌ 100 రోజుల పాలన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి పాలన ప్రారంభమై 100 రోజులు గడిచాయి. ఈ వంద రోజుల్లో ఆయన ఏం చేశారో గమనిస్తేకాని భవిష్యత్ లో ఆయన ఏం చేయబోతున్నారో అర్థం కాదు. వంద రోజుల జగన్ పాలన సంచలనాలకు మారు పేరుగా నిలిచింది అనడం అతిశయోక్తి కాదేమో. ఆయన పేదలకు అండగా నిలబడాలనే లక్ష్యాన్ని చేరుకునే దిశలో చకచక అడుగులు వేస్తున్న వైనం ఈ 100 రోజుల్లో స్పష్టమవుతోంది. తన పాలనలో నవరత్నాల కు పెద్ద పీట […]

Advertisement
Update: 2019-09-06 04:53 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి పాలన ప్రారంభమై 100 రోజులు గడిచాయి. ఈ వంద రోజుల్లో ఆయన ఏం చేశారో గమనిస్తేకాని భవిష్యత్ లో ఆయన ఏం చేయబోతున్నారో అర్థం కాదు.

వంద రోజుల జగన్ పాలన సంచలనాలకు మారు పేరుగా నిలిచింది అనడం అతిశయోక్తి కాదేమో. ఆయన పేదలకు అండగా నిలబడాలనే లక్ష్యాన్ని చేరుకునే దిశలో చకచక అడుగులు వేస్తున్న వైనం ఈ 100 రోజుల్లో స్పష్టమవుతోంది.

తన పాలనలో నవరత్నాల కు పెద్ద పీట వేయడం ద్వారా ప్రజా శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారని అవగతం అవుతుంది. ప్రజలకు మేలు చేయాలనే నిర్ణయాలను చక చక అమలు పరచాలని ప్రయత్నించే తరుణంలో కొన్ని దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శ ఆయనపై వచ్చింది.

ఈ కొద్ది కాలంలోనే జగన్ ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ తన దారేమిటో స్పష్టం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆరు నెలల్లోనే ఉత్తమ పాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని జగన్ అన్న మాటలు ఆయన పాలనపై ప్రజల అంచనాలను బాగా పెంచాయి.

సీఎం గా పాలన ప్రారంభించిన నాటి నుంచి ఆయన తనదైన పరిపాలన శైలిని ప్రదర్శించటం ప్రారంభించారు. ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ విధానాన్ని తీసుకువచ్చారు. గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అమ్మ ఒడి పథకానికి రూపకల్పన చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. పింఛన్ల విధానాన్ని కూడా సమీక్షించి విడతలవారీగా మూడు వేల రూపాయలకు పెంచడం లో భాగంగా మొదటిసారి 250 రూపాయలను పెంచారు.

రైతులకు సాయాన్ని అందించే విషయంలోనూ ముందడుగు వేశారు. ఆస్పత్రుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు నడుంబిగించారు. సుపరిపాలన అందించేందుకు పరుగులు తీస్తున్నారు. మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి జగన్ పరుగును మంత్రులు అందుకోలేక పోతున్నారనే విమర్శ వినిపించింది. అయితే ఈ పరుగులో ఆయన చేసిన కొన్ని పనులు విమర్శల పాలు అయ్యాయి.

ప్రజావేదిక కూల్చి తన పరిపాలన ఎలా ఉండబోతుందో చూచాయగా చెప్పిన జగన్… ఆ విషయంలో విమర్శల పాలయ్యారు. అయినా వాటిని పట్టించుకోకుండా ఆయన తనదైన పద్ధతిలో ముందుకు పోతున్నారు. కృష్ణానది కరకట్ట పై అక్రమ కట్టడాలను తీసి వేస్తామని చెప్తూ ఆ పనిని ప్రజా వేదిక కూల్చివేత తోనే ప్రారంభించటం చాలామంది మన్ననలను కూడా పొందింది. దీని కూల్చివేత తర్వాత ఇతర నిర్మాణ దార్లకు నోటీసులు అందించారు.

గత ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను జగన్ పునస్సమీక్షించడం ప్రారంభించారు. ముఖ్యంగా పోలవరం పనుల విషయంలో ఆయన నిర్ణయాలు విమర్శలకు దారి తీశాయి. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి పేరుకుపోయిందని, అంచనాలను పెంచి వేశారని భావించి రివర్స్ టెండరింగ్ కు పిలుపునిచ్చారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. అయినా వాటిని పట్టించుకోలేదు.

మంత్రులు చేసిన కొన్ని ప్రకటనలు రాజధాని నిర్మాణం పై నీలి నీడలు ముసురుకునేలా చేశాయి. అట్లాగే ఇసుక విధానం ప్రకటించడంలో ఆయన ఆలస్యం చేశారని, అందువలన ఎంతోమంది గృహాలు ఇతర కట్టడాలు నిర్మించుకునే వారు ఇసుక అందుబాటులోకి రాక తీవ్రమైన ఇబ్బందులు పడ్డారని విమర్శలు వచ్చాయి. పాత ప్రభుత్వం నిర్ణయాలు పథకాలపై సమీక్షలు, కేసులు… ఈ దిశలోనే జగన్ పాలన కొంత వరకు సాగింది.

జగన్ పాలన ప్రారంభం నుంచి అవినీతికి ఆస్కారం లేకుండా ఉండాలని చెబుతూ వచ్చారు. ఎప్పటికప్పుడు అధికారులను, శాసనసభ్యులను, మంత్రులను ఈ విషయంలో ఎలర్ట్ చేస్తూ వస్తున్నారు. పరిపాలన అందించే దిశలో తన సొంత మంత్రివర్గ సభ్యుల పనితీరుపై ఎప్పటికప్పుడు రహస్య నివేదికలు చెప్పించుకుంటూ వారి పని విధానాన్ని సమీక్షించుకుంటూ ఉన్నారని వినికిడి. జగన్ తన వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా మంత్రి వర్గ సభ్యులందరి పనితీరుపై ఒక నివేదికను తెప్పించుకుని పరిశీలించారట. ఈ నివేదికలో మంత్రులందరూ బాగానే పని చేసినట్లు తేలిందట.

మంత్రులు కూడా జగన్ తో పోటీ పడుతూ ఫీల్డ్ లో తిరుగుతూ తమ శక్తి మేరకు కృషి చేస్తూనే ఉన్నారు. రెండున్నరేళ్లలో మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని జగన్ ముందే చెప్పడంతో మంత్రులందరూ ఎవరికి వారు శక్తిమేరకు పని చేస్తూనే ఉన్నారు. అయితే పాలన విషయంలో వారు మంచి మార్కులు తెచ్చుకున్నా ప్రతిపక్ష విమర్శలను ఎదుర్కోవడంలో జగన్ లాగా షార్ప్ గా ఉండలేకపోతున్నా రని ఒక విమర్శ ఉంది. అట్లాగే జిల్లాల ఇన్చార్జి మంత్రులుగా ఉన్న వారు స్థానిక మంత్రులతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంలో విఫలమయ్యారని విమర్శ ఉంది.

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించటం, ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం, శ్రీకాకుళం జిల్లా పలాస లో కిడ్నీ వ్యాధి సమస్య ను పరిష్కరించే దిశలో నడుం బిగించడం, ఆస్పత్రుల పనితీరును మెరుగుపరచడానికి 1,400 కోట్ల రూపాయలను కేటాయించడం, స్పందన అనే కార్యక్రమానికి రూపకల్పన, వంద కోట్ల రూపాయలకు పైగా చేపట్టే ప్రాజెక్టుల టెండర్ల కేటాయింపుకు జుడిషియల్ కమిషన్ ఏర్పాటు వంటి అనేక నిర్ణయాలు ప్రజల మనసులను దోచుకున్నాయనడం లో అతిశయోక్తి లేదు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చటానికి మొదటి అడుగు వేశారు. నిజానికి ఆర్టీసీని ఇప్పుడు విలీనం చేయడం కుదరదు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులను మాత్రమే గుర్తించే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారు జగన్.

రైతులకు పెట్టుబడి సాయాన్ని ఈసారి రబీ పంట నుండి ఇస్తామని ప్రకటించారు. ఆ దిశగా పలు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్ పంటకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు సిద్ధపడుతున్నారు.

అమ్మఒడి ద్వారా ప్రతి తల్లికి ఏడాదికి 15 వేల రూపాయలు అందిస్తామన్నారు. ఆ పథకం అమలులో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. అయితే దీని అమలులో వెనకడుగు వేసేది లేదని ఆయన అంటున్నారు. అమ్మ ఒడిని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభిస్తామని అంటున్నారు.

పాత ఇసుక పాలసీ ద్వారా ప్రభుత్వానికి అందాల్సిన ఆదాయం అందలేదు. ఆ లోపాన్ని పూరించడం కోసం కొత్త ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు జగన్. అయితే కొంతకాలం జాప్యం చేసి ఇప్పుడు అమలు లోకి రావడం విమర్శలకు తావిచ్చింది. ప్రస్తుతం అమలులోకి తెచ్చిన విధానం వల్ల అక్రమ తవ్వకాలకు తెర పడుతుందని భావిస్తున్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక కేవలం పదహారు వందల రూపాయలకే ఇచ్చేవారు.

ఇప్పుడు టన్ను ఇసుకను మూడు వందల డబ్భై ఐదు రూపాయలు గా నిర్ణయించారు. ఒక ట్రాక్టర్ కు సుమారు నాలుగున్నర టన్నుల ఇసుక పడుతుంది. అంటే ఒక ట్రాక్టర్ ఇసుక కోసం పదహారు వందల డబ్భై ఐదు రూపాయలు చెల్లించాలి. దీనికి రవాణా చార్జీలు అదనంగా చెల్లించాలి. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి చాలా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వానికి రావాల్సిన ఈ ఆదాయాన్ని టీడీపీ నాయకులు తినేశారు.

గ్రామ వాలంటీర్ల నియామకాలకు మంచి స్పందన కనిపిస్తోంది. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి సౌకర్యం కల్పిస్తున్న ఈ ఆలోచన అందరి మన్ననలను అందుకుంటున్నది. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించే, గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరతాయి. గ్రామీణ వ్యవస్థ బలోపేతం కావడానికి, స్థానిక సమస్యలు తొందరగా పరిష్కరించడానికి ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని విమర్శకులు అంటున్నారు.

ఇప్పటివరకు పేదలకు పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందజేసేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనివల్ల పేదలకు కూడా నాణ్యమైన బియ్యం అందే అవకాశం ఏర్పడింది.

విద్యా సౌకర్యాలను మెరుగు పరచడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసే కార్యక్రమానికి తెరలేపారు. అట్లాగే ఇంగ్లీష్ మీడియం లో ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందువల్ల గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే ఫీజు రీయంబర్స్ మెంట్ జరగాల్సి ఉంది.

ప్రజాజీవితంలో అతి ముఖ్యమైన మరో విభాగం ఆరోగ్యం. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవటానికి నిధులను కేటాయిస్తున్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఆరోగ్యశ్రీ, 108 సేవలను కూడా విస్తృతంగా అందించటానికి సకల చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అక్రమకట్టడాల కూల్చివేత కు ప్రభుత్వం పూనుకుంది. ఈ విషయంలో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇచ్చే విషయాన్ని సీరియస్ గా ఆలోచిస్తున్నది. వచ్చే ఏడాది ఉగాది నాటికి 25 లక్షల ఇళ్లు పేదలకు అందించాలని నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నది.
మూడు వేల కోట్ల రూపాయలతో వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణ నిధి
ఏర్పాటు, యూనివర్సిటీల పాలన కమిటీల రద్దు, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తు, అగ్రిగోల్డ్ బాధితుల కు న్యాయం చేసే విషయంలో చొరవ… అందుకోసం 1,100 కోట్ల రూపాయలను కేటాయింపు… వంటి అనేక విషయాలపై జగన్ అందరి నుంచి మంచి మార్కులు కొట్టేశారు.

పారిశుద్ధ్య కార్మికులకు జీతాల పెంపు, దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేయడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కమిటీ నియామకం, అంగన్వాడి టీచర్ల జీతాల పెంపు వంటి నిర్ణయాలతో జగన్ జనాన్ని ఆకట్టుకుంటున్నారు.

వైయస్సార్ అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు భోజన పథకం, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ల అమలు వంటి చర్యలు, బస్సుచార్జీల నియంత్రణకు కమిటీ వేయాలని నిర్ణయం వంటివి జగన్ కి మంచి మైలేజి ఇచ్చాయి.

గిరిజన ప్రాంతాల్లో యూనివర్సిటీల ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. సదావర్తి భూములపై విజిలెన్స్ విచారణ చేయించాలని ఆయన భావిస్తున్నారు. కిడ్నీ వ్యాధి బాధితుల కు పదివేల రూపాయల సహాయం అందించాలననే నిర్ణయం కూడా ఆదరణ పొందుతున్నది.

ఈ అన్ని విషయాలను గమనిస్తే జగన్ తాను ఏమి అనుకుంటే అది చేయడానికి విమర్శలు, పొగడ్తలకు అతీతంగా ముందుకు వెళ్తున్నారని అర్థమవుతుంది. ఆయన పాలన కు వంద రోజులు వయసే… ఇంకా ముందు ముందు మరింత ప్రజారంజకంగా ఆయన పాలన ఉంటుంది అని విమర్శకుల తోపాటు ప్రజలు ఆశిస్తున్నారు. అప్పుడే ఆయన పాలనపై విమర్శలు గుప్పించవలసిన అవసరంలేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News