"దేశం" కోటలో ఫ్యాన్ పాగా?

బళ్లు ఓడలవుతాయి. ఓడలు బళ్లవుతాయి. ఇది ఏ రంగంలోనైనా సహజమే. రాజకీయ రంగంలో అయితే మరీ సహజం. ఐదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన వారు ఆ తర్వాత కనుమరుగు కావడం రాజకీయాలలో కొత్త కాదు. అలాగే, కొన్ని ప్రాంతాలు, నియోజకవర్గాలు, ఏకంగా జిల్లాలే తమవని అనుకుని భ్రమలో ఉండే పార్టీలకు కొన్నాళ్ల తర్వాత అవేవీ తమవి కావని అర్ధం అవుతుంది. అదిగో అప్పుడే బళ్లు ఓడలు…. ఓడలు బళ్లు అవడం అనే సామెత వారికీ గుర్తుకొస్తుంది. […]

Advertisement
Update: 2019-04-17 20:32 GMT

బళ్లు ఓడలవుతాయి. ఓడలు బళ్లవుతాయి. ఇది ఏ రంగంలోనైనా సహజమే. రాజకీయ రంగంలో అయితే మరీ సహజం. ఐదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన వారు ఆ తర్వాత కనుమరుగు కావడం రాజకీయాలలో కొత్త కాదు.

అలాగే, కొన్ని ప్రాంతాలు, నియోజకవర్గాలు, ఏకంగా జిల్లాలే తమవని అనుకుని భ్రమలో ఉండే పార్టీలకు కొన్నాళ్ల తర్వాత అవేవీ తమవి కావని అర్ధం అవుతుంది. అదిగో అప్పుడే బళ్లు ఓడలు…. ఓడలు బళ్లు అవడం అనే సామెత వారికీ గుర్తుకొస్తుంది.

ఇంతకీ విషయం ఏమిటంటే…. తెలుగుదశం పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా భావించిన జిల్లాలు అటు ఆంధ్రప్రదేశ్ లోను, ఇటు తెలంగాణలోనూ కూడా ఉన్నాయి. తెలంగాణలో అయితే తెలుగుదేశం పార్టీ పూర్తి స్దాయిలో లేకుండా పోయింది. ఇక్కడ పార్టీకి జవజీవాలు తీసుకురావాలని చేసిన ప్రయత్నాలు ఏవీ మంచి ఫలితాలు ఇవ్వలేదు. దీంతో అనివార్యంగా పార్టీని తెలంగాణలో మూసేసే పరిస్థితి వచ్చింది.

ఇటీవల జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినా… లోక్ సభ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం నుంచి పోటీ చేసేందుకు నాయకుడే లేకుండా పోయారు. ఇది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. మరీ ఇంతలా కాకపోయినా… ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం పార్టీ తనకు కంచుకోట అని భావిస్తున్న జిల్లాల్లో ఈసారి కంగుతినే పరిస్థితి ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి మంచి పట్టు ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతారు. ఈసారి ఈ మూడు జిల్లాలలోను ఒక్క విశాఖపట్నం జిల్లాలో మినహా మిగిలిన రెండు జిల్లాల్లోను తెలుగుదేశం పార్టీకి పరాభవం తప్పదేమోననే భయం ఆ జిల్లా తెలుగుదేశం నాయకులను వేధిస్తోంది అంటున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈసారి గణనీయ సంఖ్యలో నియోజకవర్గాలు తగ్గే పరిస్థితి ఉందంటున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలు కూడా తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న జిల్లాలే. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని స్ధానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి ఇక్కడ ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్ధానాలుంటే కనీసం 10 స్థానాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందంటున్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో 19 స్ధానాలుంటే ఈసారి ఇక్కడ 12 నుంచి 15 స్ధానాలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెబుతున్నారు.

ఈ రెండు జిల్లాలు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావిస్తారు. ఇక రాయలసీమలోని అనంతపురం జిల్లా కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉండేది. ఈసారి ఈ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని అంటున్నారు.

అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆశించిన స్ధాయిలో విజయం దక్కే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News