నడుముకు నోట్ల కట్టలు కట్టుకొని..

ఇద్దరు వ్యక్తులు నోట్ల కట్టలను తమ నడుముకు కట్టుకొని తరలిస్తూ అధికారులకు పట్టుబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.

Advertisement
Update: 2023-11-28 15:20 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నోట్ల క‌ట్ట‌లు కుప్పలు కుప్పలుగా పట్టుబడ్డాయి. ఓటర్లకు పంచేందుకు అక్రమంగా డబ్బు తరలిస్తూ ఎంతోమంది పట్టుపడ్డారు. పోలీసుల తనిఖీల్లో ఇప్పటివరకు సుమారు రూ.724 కోట్ల సొత్తు పట్టుబడినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతుండగా.. తెలంగాణలోనే అధికంగా సొత్తు పట్టుబడిన‌ట్లు అధికారులు ప్రకటించారు.

ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో పోలీసుల కంటపడకుండా పలువురు చాకచక్యంగా డబ్బు తరలించే ప్రయత్నం చేశారు. కొందరు కారు వెనుక డోర్లలో, కారు బానెట్‌లో దాచిపెట్టి ఎవరికీ కనిపించకుండా డబ్బును తరలిస్తూ పోలీసులకు చిక్కారు.

ఇవాళ ఇద్దరు వ్యక్తులు నోట్ల కట్టలను తమ నడుముకు కట్టుకొని తరలిస్తూ అధికారులకు పట్టుబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఓ ద్విచక్ర వాహనం అటుగా రాగా అందులో వచ్చిన ఇద్దరు వ్యక్తుల వద్ద అధికారులు తనిఖీ చేశారు. వాహనంలో ఎటువంటి నగదు కనిపించకపోగా.. ఆ ఇద్దరు వ్యక్తులు తమ నడుముకు నోట్ల కట్టలు కట్టుకున్నట్లు గుర్తించారు. ఇద్దరి వద్ద మొత్తం రూ.10 లక్షల నగదు పట్టుబడింది. అయితే ఆ నగదుకు సంబంధించి ఆధారాలు చూపించకపోవడంతో అధికారులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News