అమెరికాలో మ‌రో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆందోళ‌న‌లో తల్లిదండ్రులు

తెలంగాణకు చెందిన రూపేష్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. అతడు అదృశ్యమైనట్లు తెలియగానే కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.

Advertisement
Update: 2024-05-09 09:00 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థులు అప‌హ‌ర‌ణ‌లు పెరిగిపోతున్నాయి. దీంతో పిల్ల‌ల్ని ఉన్న‌త విద్య‌, ఉద్యోగాల కోసం అమెరికాకు పంపిన త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న పెరిగిపోతోంది. తాజాగా తెలంగాణ‌కు చెందిన ఓ విద్యార్థి షికాగోలో అదృశ్యమయ్యాడు. వారం రోజులుగా అతడి ఆచూకీ లేదని అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

తెలంగాణకు చెందిన రూపేష్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. అతడు అదృశ్యమైనట్లు తెలియగానే కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగ శాఖను, అమెరిక‌న్ ఎంబసీని అభ్యర్థించారు.

భారత్‌కు చెందిన విద్యార్థి రూపేష్‌చంద్ర చింతకింది మే 2 నుంచి కన్పించడం లేద‌ని తెలిసిన‌ట్లు కాన్సులేట్ ప్ర‌క‌టించింది. అతడి ఆచూకీ కోసం పోలీసులు, ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామ‌ని, త్వరలోనే రూపేష్ జాడ తెలుస్తుందని ఆశిస్తున్నామ‌ని షికాగోలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో పేర్కొంది. పోలీసులు కూడా దీనిపై ప్రకటన విడుదల చేశారు. రూపేష్ ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని స్థానికులను కోరారు.

అదృశ్య‌మై శ‌వాలుగా తేలుతున్నారు

ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి అమెరికాలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దాడులు, కిడ్నాప్ వంటి ఘటనల్లో ఇప్పటికే పలువురు భారతీయ, భారత సంతతి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా ఉంటున్నారు. గ‌త నెల‌లో హైద‌రాబాద్‌కు చెందిన ఓ విద్యార్థిని కిడ్నాప‌ర్లు అప‌హ‌రించి, డ‌బ్బులు డిమాండ్ చేశారు. కొన్ని రోజుల త‌ర్వాత అత‌ణ్ని చంపేశారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌తో ఇండియాలో ఉన్న‌ త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న పెరిగిపోతోంది. ఇలాంటి వార్త‌లు విన్న వెంట‌నే అమెరికాలో ఉన్న త‌మ పిల్ల‌ల‌కు ఫోన్ చేసి క్షేమ‌స‌మాచారాలు క‌నుక్కుంటున్నారు. మ‌రోవైపు త‌మ దేశానికి చ‌దువుకోవ‌డానికి, ఉద్యోగాల కోసం వ‌చ్చే ఇండియ‌న్లు అదృశ్య‌మవుతున్న ఘ‌ట‌న‌ల‌పై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని ప్ర‌క‌టించింది.

Tags:    
Advertisement

Similar News