రైతులకు కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్.. రుణమాఫీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం?

2018 ఎన్నికల హామీ మేరకు తొలి దశలో రూ. 25వేల వరకు ఉన్న రుణాలను 2020లో మాఫీ చేశారు. మరుసటి ఏడాది రెండో దశలో రూ 50 వేల వరకు మాఫీ చేశారు.

Advertisement
Update: 2022-12-27 10:58 GMT

రైతులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త సంత్సరంలో భారీ బహుమతిని ఇవ్వబోతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని పూర్తిగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. రైతులకు రూ.1 లక్ష వరకు రుణమాఫీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు 2023 జనవరిలో ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రూ.1 లక్ష వరకు రుణమాఫీలు రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే అనేక కారణాల వల్ల ఓకే సారి ఈ హామీని నెరవేర్చలేకపోయారు.

బీఆర్ఎస్ పేరుతో 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అనే నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశించారు. ప్రతిపక్షాలు విమర్శించడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని, రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో మరోసారి తెలియజేయాలని భావిస్తున్నారు.

2018 ఎన్నికల హామీ మేరకు తొలి దశలో రూ. 25వేల వరకు ఉన్న రుణాలను 2020లో మాఫీ చేశారు. మరుసటి ఏడాది రెండో దశలో రూ 50 వేల వరకు మాఫీ చేశారు. ఇక జనవరి నుంచి రెండు దశల్లో రూ. 75వేల లోపు, రూ.1 లక్షలోపు రుణాలను రద్దు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేయకుండా.. ఈ రుణ మాఫీకి సంబంధించిన చెక్కులను రైతులకే అందించనున్నారు. రెండో దశలో రూ.50 వేల వరకు 2021 అగస్టు 15 నుంచి 31 మధ్య రుణమాఫీ చేశారు. అప్పుడు రైతు ఖాతాలకే నేరుగా అమౌంట్ జమ చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో దఫా అధికారంలోకి వచ్చిన సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని అమలు చేయాలంటే రూ.25 వేల కోట్ల వరకు అవసరం అని అంచనా వేశారు. దీని ద్వారా రాష్ట్రంలోని 36.8 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది. అయితే ఒకేసారి రుణ మాఫీ చేస్తే ఖజానాపై భారం పడుతుంది. అందుకే దశల వారీగా దీన్ని అమలు చేస్తున్నారు. మొదటి దశలో 2.96 లక్షల మంది రైతులకు రూ.408 కోట్ల మాఫీ చేశారు. ఇక రెండో దశలో 6.06 మంది రైతులకు రూ.4,900 కోట్ల మేర మాఫీ చేశారు.

కరోనా కారణంగా రాష్ట్ర రాబడి తగ్గిపోవడం, కేంద్ర ప్రభుత్వం అప్పులపై ఆంక్షలు విధించడం, కేంద్రం నుంచి రావల్సిన నిధులు కూడా సక్రమంగా రాకపోవడంతో మూడు, నాలుగు దశలను అమలు చేయడంలో జాప్యం జరిగింది. అంతే కాకుండా చాలా మంది రైతుల వేర్వేరు చోట్ల రుణాలు తీసుకున్నారు. పంటల కోసం కాకుండా ఇతర అవసరాల కోసం కూడా రుణాలు తీసుకున్న వాళ్లు ఉన్నారు. అందుకే ఈ సారి ఆధార్ లింకేజి, పట్టాదార్ పాసు పుస్తకాలు, రేషన్ కార్డులను పూర్తిగా పరిశీలించి డూప్లికేట్ ఎంట్రీలను తొలగించాలని నిర్ణయించారు. ఒక కుటుంబంలో ఒకే లబ్దిదారుడు ఉండేలా రుణమాఫీ అమలు చేయనున్నారు.  

Tags:    
Advertisement

Similar News