సీఎం మెడలు వంచుతాం.. మీ మద్దతివ్వండి

Advertisement
Update: 2024-04-28 02:16 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.. కాళ్లు తంగెళ్లు దాటడం లేదని ఎద్దేవా చేశారు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్. బస్సుయాత్రలో భాగంగా నాగర్‌ కర్నూల్‌ లో జరిగిన రోడ్ షో లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు జరిగేలా చేయాలంటే బీఆర్ఎస్ కి మద్దతివ్వాలన్నారు. నా ప్రాణంపోయినా తెలంగాణ తెస్తా అని చెప్పిమరీ తెలంగాణ సాధించానని, ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రజల తరపున వాదించాలంటే తనకు ప్రజల మద్దతు కావాలని చెప్పారు. ప్రజల తరపున యుద్ధం చేయడానికి తాను సిద్ధం అని చెప్పారు కేసీఆర్


చేతగాని సీఎం..

ముఖ్యమంత్రి తెలంగాణకు కొత్తగా చేయాల్సిందేమీ లేదని, ఏమీ ఇవ్వకున్నా.. నడిచినదాన్నే నడిపించవచ్చు కదా? అది కూడా చేతగాకపోతే ఎలా అని ప్రశ్నించారు కేసీఆర్. ఐదెకరాల వరకే రైతుబంధు అంటే ఆరెకరాల రైతు ఏం చేయాలని ప్రశ్నించారు కేసీఆర్. 10 ఎకరాలున్నోడు ఏం కావాలని, రైతులంటే అంత చులకనా అని అడిగారు. 20-30 ఎకరాలున్నోళ్లకు ఇవ్వట్లేదంటే అర్థముందని, మరీ 6 ఎకరాల రైతుకి కూడా రైతుబంధు బంద్ చేస్తే ఇంకేం చేయాలన్నారు. వాళ్ల అయ్య సొత్తు ఏమీ పోదు కదా, వాళ్ల జాగీరు ఏమీ నష్టపోరు కదా అది ప్రజల సొమ్మే కదా అన్నారు కేసీఆర్.

నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అల్లాటప్పా రాజకీయ నాయకుడు కాదని, మాజీ ఐపీఎస్‌ అధికారి అని, నియోజకవర్గాన్ని ప్రపంచంలో పెట్టే స్థాయికి తీసుకుపోయే బాధ్యత తనది అని చెబుతున్నారని.. ఆయనకు బలం ఇస్తే సీఎం మెడలు వంచి హామీలు అమలు చేయిస్తామని చెప్పారు కేసీఆర్. ప్రజల్లో ఆ చైతన్యం రావాలన్నారు. ఒరవడిలో కొట్టుకుపోకుండా భవిష్యత్తుకోసం ఆలోచన చేయాలన్నారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని, రందిపడాల్సిన అవసరం లేదని చెప్పారు కేసీఆర్. ఎక్కడికి పోయినా ప్రజలు అభిమానంతో తన బస్సుని చుట్టుముట్టి కదలనివ్వడంలేదని, వారు అంతలా మారిపోయారని, కాంగ్రెస్ పై అప్పుడే విరక్తి వచ్చేసిందని చెప్పారు. ఈ ప్రభుత్వానికి చురక పెట్టాలని, కర్రుకాల్చి వాత పెట్టాలని బలుపు దించాలని పిలుపునిచ్చారు కేసీఆర్. 

Tags:    
Advertisement

Similar News