చెప్పేది దేవుడి పేరు.. చేసేది అదానీ సేవ

దేశాన్ని ముంచి దేవుడి పేరుతో ఓట్లు అడిగేవారిని పట్టించుకోవద్దని అన్నారు కేటీఆర్. అరచేతిలో వైకుంఠం చూపెట్టిన రేవంత్‌రెడ్డి.. 5 నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం చేశారని మండిపడ్డారు.

Advertisement
Update: 2024-05-10 02:38 GMT

ఎన్డీఏ ప్రభుత్వం అదానీ, అంబానీ సేవలో తరించిపోతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదానీ, అంబానీలకు రూ.14 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని, తాను చెప్పింది అబద్ధమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. మోదీతో కొట్లాడే ధైర్యం రాహుల్‌గాంధీకి లేదని అన్నారు కేటీఆర్. ప్రాంతీయ పార్టీలే మోదీతో బలంగా కొట్లాడుతాయని చెప్పారు. కాంగ్రెస్‌ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ బీజేపీ వాళ్లు ఆయా ప్రభుత్వాలను అలవోకగా పడగొట్టారని, స్థానిక పార్టీలు అధికారంలో ఉన్నచోట మాత్రం వారిజోలికి రాలేకపోయారని వివరించారు. కేసీఆర్‌, మమతాబెనర్జీ, హేమంత్‌ సోరెన్‌, స్టాలిన్‌, కేజ్రీవాల్‌ ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నం చేసి బీజేపీ విఫలమైందని అన్నారు కేటీఆర్.

దేశాన్ని ముంచి దేవుడి పేరుతో ఓట్లు అడిగేవారిని పట్టించుకోవద్దని అన్నారు కేటీఆర్. 'దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేవాళ్లు.. చెప్పేది దేవుడు పేరు, చేసేది అదానీకి సేవ' అని విమర్శించారు. మేడ్చల్‌- మల్కాజ్ గిరి జిల్లాలో, నిర్మల్‌, భైంసాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ కూడా తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు కేటీఆర్.

అరచేతిలో వైకుంఠం చూపెట్టిన రేవంత్‌రెడ్డి.. 5 నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం చేశారని మండిపడ్డారు కేటీఆర్. ఆయన మాటలు నమ్మితే మరోసారి మోసపోయి గోసపడాల్సి వస్తుందని చెప్పారు. కేసీఆర్ పాలన ఎలా ఉంది, ఇప్పుడెలా ఉందనే విషయాన్ని ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. ఒక్క హామీ కూడా అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోసారి ఓటు వేయాలా అని ప్రశ్నించారు కేటీఆర్. కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ బాగుంది అనుకునేవారు.. మే 13న బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 10 నుంచి 12 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ కి వస్తే ఆ తర్వాత 6 నెలల్లోనే కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్ర రాజకీయం మొత్తం కేసీఆర్‌ చుట్టూ గింగిరాలు కొడుతుందన్నారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News