వాళ్ల ప్రెస్‌మీట్లు కవర్‌ చేయకండి.. కాంగ్రెస్ పెద్దల ఆర్డర్‌

రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఎవరైనా సరే ఆయన్ను వచ్చి కలవాలి, అంతేకాని ఆయనే వెళ్లి వారిని కలవడం, పార్టీలోకి ఆహ్వానించడం సరికాదు.

Advertisement
Update: 2024-03-24 12:12 GMT

సీఎం రేవంత్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీతో పాటు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో తీవ్ర దుమారం రేపాయి. వీహెచ్‌ వ్యాఖ్యలు సీఎం రేవంత్‌ రెడ్డి సహా కాంగ్రెస్‌పార్టీలోని ముఖ్య నాయకులను బాగా నొప్పించాయని టాక్. అందుకే గాంధీ భవన్‌లో వీ. హనుమంత్ రావు, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్ ప్రెస్ మీట్‌లకు లైవ్ లింకులు, సమాచారం ఇవ్వొద్దని గాంధీ భవన్ సిబ్బందికి ఆదేశాలిచ్చారని సమాచారం. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే వారి ప్రెస్‌మీట్లు కవర్ చేయొద్దని పార్టీ పెద్దలు ఆర్డర్ వేసినట్లు టాక్ నడుస్తోంది.

వీహెచ్‌ ఏమన్నారంటే.. "రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఎవరైనా సరే ఆయన్ను వచ్చి కలవాలి, అంతేకాని ఆయనే వెళ్లి వారిని కలవడం, పార్టీలోకి ఆహ్వానించడం సరికాదు. అలా వెళ్లి ఆహ్వానించి రేవంత్ తన స్థాయి తగ్గించుకోవద్దు. బీఆర్ఎస్‌ నేతలు అక్రమంగా డబ్బు సంపాదించి.. అధికారంలో ఉన్నామని కాంగ్రెస్‌లోకి వస్తున్నారు.

కాంగ్రెస్ క్యాడర్‌కు న్యాయం చేయకుండా.. మన కార్యకర్తలపై కేసులు పెట్టినవాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒకవైపు మాత్రమే వింటున్నారు, రెండువైపులా ఆయన కార్యకర్తల మాట వినాలి. పరిస్థితులు చూసి కార్యకర్తలు బాధపడుతున్నారు. పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయకు. ఈ విషయాలన్నీ కలిసి చెబుదామంటే టైమ్ ఇస్తలేవు. నేను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు. ఎవరికీ అన్యాయం జరగొద్దనేదే నా ఆవేదన" అంటూ వీహెచ్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పెద్దల ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఫలితంగా గాంధీ భవన్‌లో పెద్దాయనకు మైక్ కట్ అయింది.

Tags:    
Advertisement

Similar News