అన్ని దారులూ మునుగోడు వైపే.. ఆసక్తిగా చూస్తోన్న తెలంగాణ ప్రజలు

టీఆర్ఎస్ పార్టీ మునుగోడు నియోజకవర్గంలో 'ప్రజా దీవెన' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సీఎం కేసీఆర్ ఈ సభలో పాల్గొననుండటంతో కేవలం మునుగోడు ప్రజలే కాకుండా తెలంగాణ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Advertisement
Update: 2022-08-20 02:37 GMT

తెలంగాణలో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉపఎన్నిక సెమీఫైనల్ అంటూ ప్రచారం జరగడంతో.. అన్ని పార్టీలు అప్రమత్తం అయ్యాయి. రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనుండగా.. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటార‌నే విషయంపై ఇంకా సందిగ్ధ‌త నెలకొన్నది. అయితే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం మాత్రం మొదలు పెట్టబోతున్నాయి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మునుగోడు నియోజకవర్గంలో 'ప్రజా దీవెన' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సీఎం కేసీఆర్ ఈ సభలో పాల్గొననుండటంతో కేవలం మునుగోడు ప్రజలే కాకుండా తెలంగాణ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

కేసీఆర్ పాల్గొనే ప్రజా దీవెన సభ మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రారంభం కానున్నది. అయితే గత వారం రోజుల నుంచే టీఆర్ఎస్ నాయకులు భారీ జన సమీకరణకు రంగం సిద్ధం చేశారు. రెండు రోజుల వ్యవధిలో టీఆర్ఎస్, బీజేపీ బహిరంగ సభలు నిర్వహిస్తుండటంతో.. బల ప్రదర్శనకు ఇరు పార్టీలు సిద్ధ‌మవుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండటంతో క్షేత్రస్థాయిలో జనసమీకరణపై దృష్టిపెట్టింది. మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి ప్రజలను సీఎం సభకు తీసుకొని వచ్చేలా ఇంచార్జులకు బాధ్యతలు అప్పగించింది. మంత్రులు జగదీశ్ రెడ్డి, హరీశ్ రావులు ఎప్పటికప్పుడు ఇంచార్జులతో మాట్లాడుతూ స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేస్తున్నారు. తమకు ఆహ్వానం అందలేదని కొంత మంది స్థానిక నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. అలాంటి వారితో టీఆర్ఎస్ అధిష్టానం ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండి వారితో మాట్లాడుతోంది.

ఇక ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా సమాచారం తెప్పించుకొని అసంతృప్త నాయకులను బుజ్జగించే పనిలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ బహిరంగ సభను ఎలాగైనా విజయవంతం చేయాలని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆయన సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి గత కొన్ని రోజులుగా తీవ్రంగా కష్టపడుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జులతో పాటు, స్థానిక నాయకులతో మాట్లాడి జనాలను తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రతీ గ్రామం నుంచి సభకు వెళ్లడానికి వాహనాలను సిద్ధం చేశారు. ఇక హైదరాబాద్ నుంచి 4 వేల కార్లతో ర్యాలీ నిర్వహించడానికి టీఆర్ఎస్ రంగం సిద్ధం చేసింది.

విపక్షాల కంటే అధికార టీఆర్ఎస్ ముందుగానే సభ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భారీగా జనాలను సమీకరించి.. బల ప్రదర్శన చేయాలని భావిస్తోంది. తర్వాత జరిగే సభలకు ఎంత మంది వస్తారనే అవగాహన లేకపోయినా.. సీఎం సభను మాత్రం విజయవంతం చేయడానికి టీఆర్ఎస్ నాయకులు చాలా కష్టపడుతున్నారు. ఇక అసంతృప్త నేతలతో పాటు మునుగోడు నియోజకవర్గంలోని కీలక నాయకులతో హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ రోజు సీఎంను కలిసే వీలు లేకపోయినా బాధపడవద్దని.. త్వరలోనే ప్రగతిభవన్‌లో సీఎం అందరితో మాట్లాడతారని స్థానిక నాయకులకు చెప్పినట్లు తెలుస్తున్నది.

టీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని సీఎం కేసీఆర్ లెక్కలతో సహా వివరించనున్నారు. అలాగే రాబోయే రోజుల్లో చేపట్టనున్న కార్యక్రమాలను కూడా వెల్లడించనున్నారు. కేవలం మునుగోడుకే కాకుండా.. తెలంగాణలో ఎలాంటి పనులు చేయబోతున్నారో కూడా వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకే ఇవ్వాల్టి సభ కోసం తెలంగాణ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ రోజు సీఎం కేసీఆర్ షెడ్యూల్...

- ఉదయం 10.00 గంటలకు ప్రగతి భవన్ నుంచి మేడ్చల్ బయలుదేరుతారు

- 10.20 గంటలకు జెన్వీ కన్వెన్షన్‌లో కేసీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ సీహెచ్. వాసుదేవరెడ్డి కుమార్తె పెళ్లికి హాజరవుతారు.

- 10.40కి మేడ్చల్ నుంచి బయలుదేరతారు.

- 11.00 ప్రగతి భవన్ చేరుకుంటారు.

- మధ్యాహ్నం 12.30గంటలకు ప్రగతిభవన్ నుంచి మునుగోడు బయలుదేరతారు.

- మధ్యాహ్నం 2.00 గంటలకు మునుగోడులో జరిగే సభలో సీఎం పాల్గొంటారు.

సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో ప్రగతిభవన్ నుంచి సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, చౌటుప్పల్ మీదుగా మునుగోడు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. కాబట్టి ఎన్‌హెచ్ 65 మీద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంటుందని, ప్రత్యామ్నాయ రహదారులు చూసుకోవాలని పోలీసులు చెప్పారు. చౌటుప్పల్ నుంచి మునుగోడు సభకు వాహనాల్లో వెళ్లే వారు కూడా వేరే రూట్‌లో వెళ్లాలని నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి చెప్పారు.

Tags:    
Advertisement

Similar News