వ్యవసాయంతో కూడా అద్భుతాలు సృష్టించవచ్చంటున్న యువరైతు

Agriculture News: శ్రీకాంత్‌కి 20 ఎకరాల పొలం ఉంది. దీనిలో వివిధ రకాల పంటలను పండిస్తున్నాడు. తమ కుటుంబం అనుసరించిన మూస ధోరణిని వదిలేసి సీజన్‌ను బట్టి పంట మార్పిడి పద్ధతిని అవలంభిస్తూ అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.

Advertisement
Update: 2022-11-11 06:33 GMT

వ్యవసాయం

వ్యవసాయం కలిసి రావడం లేదని.. దశాబ్దాలుగా కొనసాగిస్తున్న దానిని పక్కనబెట్టేసి పట్టణం బాట పడుతున్నారు కొందరు రైతులు. అక్కడే ఏదో ఒక చిన్నా చితక ఉద్యోగం చేసుకుంటూ నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొందరు యువకులు మాత్రం చేస్తున్న లక్షల రూపాయల ఉద్యోగాలను వదిలేసి వ్యవసాయమే ముద్దని పల్లెబాట పట్టి అద్భుతాలు సృష్టిస్తున్నారు. సాగుపై సరైన అవగాహన ఆపై మార్కెటింగ్‌ నైపుణ్యం ఉండాలే కానీ వ్యవసాయం అంత ది బెస్ట్ జాబ్ మరొకటి లేదని చెబుతున్నారు.

వ్యవసాయంలోనే అధిక సంపాదన ఉంటుందని యువ రైతులు నిరూపిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ అద్భుతమైన లాభాలను ఆర్జిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ డిగ్రీ చేశాడు. ఆపై డీఎడ్ పూర్తి చేశాడు. అతను ఎలాంటి ఉద్యోగాల కోసమూ ఎదురు చూడలేదు. హాయిగా ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. శ్రీకాంత్‌ కుటుంబం.. తరతరాల నుంచి వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తోంది. దీంతో అతను కూడా తన కుటుంబం నడుస్తున్న దారిలోనే పయనించాలని డిసైడ్ అయ్యాడు.

శ్రీకాంత్‌కి 20 ఎకరాల పొలం ఉంది. దీనిలో వివిధ రకాల పంటలను పండిస్తున్నాడు. తమ కుటుంబం అనుసరించిన మూస ధోరణిని వదిలేసి సీజన్‌ను బట్టి పంట మార్పిడి పద్ధతిని అవలంభిస్తూ అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. 20 ఎకరాల్లోనూ వివిధ రకాల పూలు, కూరగాయలు సాగు చేస్తూ పెద్ద మొత్తంలో లాభాలను పోగు చేసుకుంటున్నాడు. ఐదెకరాల్లో చామంతి పూలు సాగు చేస్తూ రూ.10 లక్షల నుంచి 15 లక్షల దాకా సంపాదిస్తున్నాడు.

గత ఐదేళ్లుగా చామంతి పూలు, కూరగాయలు పండిస్తున్నానని శ్రీకాంత్ తెలిపాడు. ప్రభుత్వ ఉద్యోగుల సంపాదన కంటే కూడా ఎక్కువగా తాను వ్యవసాయం ద్వారానే ఆర్జిస్తున్నట్టు వెల్లడించాడు. అంతేకాదు వ్యవసాయాన్ని వృత్తిగా మార్చుకున్నందుకు చాలా గర్వంగా ఉందని చెబుతున్నాడు. వ్యవసాయంలో ముందుగా నైపుణ్యంతో పాటు ఏ పంట వేయాలనే అవగాహనను పెంచుకుంటే వ్యవసాయంలో లాభాలను ఆర్జించవచ్చని శ్రీకాంత్ వెల్లడించాడు. మార్కెట్‌ను అంచనా వేస్తే నష్టాల మాటే వినిపించదని తెలిపాడు.

Tags:    
Advertisement

Similar News