ఎల్లో మీడియా పవన్‌ను టార్గెట్ చేసిందా? జనసేన శిబిరంలో ఆందోళన

వచ్చే ఎన్నికల్లో ఒకవేళ జనసేన ఒంటరిగా వెళ్లినా... కేవలం బీజేపీతో మాత్రమే కలిసి పోటీచేసినా మనకు నష్టమని టీడీపీ శిబిరం భావిస్తోందట. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఓ చానల్ లో ఇటీవల పవన్‌కు వ్యతిరేకంగా కథనాలు వచ్చాయి.

Advertisement
Update: 2022-11-16 08:49 GMT

పవన్ కల్యాణ్

తెలుగుదేశం పార్టీకి ఉన్న గొప్ప బలం మీడియా సపోర్ట్. అనుకూల మీడియా కనుక లేకపోతే అసలు ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమే.. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు ఏవో ఐదో తరగతి పిల్లవాడిని అడిగినా చెబుతారు. సదరు మీడియా పత్రికల్లో, చానళ్లలో నిత్యం చంద్రబాబు భజన, ప్రత్యక్షంగా, పరోక్షంగా జరుగుతూ ఉంటుంది.

చంద్రబాబుకు ప్రత్యర్థి సీఎం జగన్ కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం వ్యతిరేక కథనాలు వండి వార్చడం.. సదరు మీడియా సంస్థల పని. ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే ఏ చిన్న అవకాశాన్ని వాళ్లు వదులుకోరు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎవరు విమర్శలు గుప్పించినా.. వారికి విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే సీఎం జగన్ కు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ చేసే విమర్శలకు సదరు మీడియా సంస్థల్లో మంచి ప్లేస్ దొరుకుతూ ఉంటుంది.

అంతేకాక వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా కాకుండా జనసేనతో కలిసి పోటీచేయాలన్నది ఆ పార్టీ శ్రేయోభిలాషుల అభిప్రాయం. అందులో భాగంగానే సదరు సంస్థల్లో పవన్ కల్యాణ్ కు, జనసేనకు హైప్ వస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే ఇటీవల పవన్ కల్యాణ్ కాస్త దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రధానితో భేటీ అయ్యాక.. ఆయన రాజకీయ ప్రకటనల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. తనకు ఒక అవకాశం ఇవ్వాలంటూ ఆయన ఇటీవల నేరుగా ఉత్తరాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు జనసేన సోషల్ మీడియా కూడా పవన్ కల్యాణ్ ప్రసంగం ఆధారంగా తాము వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని.. మహా అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం కానీ.. మరే ఇతర రాజకీయ పార్టీతోనూ తాము ఎన్నికల అవగాహన కుదుర్చుకోమని జనసైనికులు పోస్టులు పెడుతున్నారు. దీంతో తెలుగుదేశం నేతలు, ఎల్లో మీడియా కాస్త అలర్ట్ అయినట్టు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో ఒకవేళ జనసేన ఒంటరిగా వెళ్లినా... కేవలం బీజేపీతో మాత్రమే కలిసి పోటీచేసినా మనకు నష్టమని టీడీపీ శిబిరం భావిస్తోందట. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఓ చానల్ లో ఇటీవల పవన్‌కు వ్యతిరేకంగా కథనాలు వచ్చాయి. మరి వచ్చే ఎన్నికల నాటికి జనసేన, టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్తాయా? లేక జనసేన కేవలం బీజేపీతో మాత్రమే కలిసి పోటీచేస్తుందా? అన్నది వేచి చూడాలి.

ప్రధాని మోడీతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ కాస్త ముభావంగా కనిపించారు. మరి మోడీకి పవన్ కల్యాణ్ కు మధ్య ఎటువంటి రాజకీయ చర్చలు జరిగాయన్న విషయంపై కూడా క్లారిటీ లేదు. మొత్తంగా భారతీయ జనతాపార్టీ హైకమాండ్ మాత్రం.. టీడీపీతో కలిసి పోటీచేసేందుకు గానీ.. ఆ పార్టీకి లాభం కలిగేలా రాజకీయం చేసేందుకు సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. ఒకవేళ టీడీపీతో కలిసి వెళ్లాల్సి వస్తే.. పవన్ బీజేపీని వదులుకోవాల్సిన పరిస్థితి. మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఒకవేళ పవన్ టీడీపీని పూర్తిగా పక్కకు పెడితే.. ప్రస్తుతం ఆయనకు భజన చేసే మీడియా తిరగబడి వ్యతిరేక కథనాలు రాయడం కూడా ఖాయమే.. భవిష్యత్ లో ఏం జరగబోతున్నదో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News