ఆ విషయంలో పవన్ కల్యాణ్ అంతగా ఫీలయ్యారా..?

"కాపులను తాకట్టు పెట్టేస్తున్నావ్‌ అని నాయకులు తనను విమర్శిస్తున్నారని, ఆ స్థాయి నాకు ఉంటే నేను ఎన్నికల్లో ఓడిపోతానా?" అని లాజిక్ తీశారు పవన్. పరోక్షంగా కాపులు తనతో లేరనే విషయాన్ని ఆయన ఒప్పేసుకున్నారు.

Advertisement
Update: 2024-04-29 03:51 GMT

ఇటీవల ముద్రగడ పద్మనాభం పదే పదే ఒక విషయంలో పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు. మొహానికి రంగులు వేసుకునేవారిని, హైదరాబాద్ లో కూర్చుని ఏపీలో రాజకీయాలు చేయాలనుకునేవారిని ప్రజలు నమ్మొద్దని అంటున్నారాయన. ఈ కామెంట్లకు ప్రజల స్పందన ఎలా ఉందో తెలియదు కానీ, పవన్ కల్యాణ్ మాత్రం బాగా ఫీలయిపోయినట్టు అర్థమవుతోంది. తాజా మీటింగ్ లో ఆయన ముద్రగడ వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు. సినిమా వాళ్లు మనుషులు కాదా..? సినిమా వాళ్లకు సామాజిక బాధ్యత లేదా అని ప్రశ్నించారు పవన్. "కిర్లంపూడిలోని పెద్దలు.. సినిమా నటులకు ఏం తెలుసని అన్నారు. ఆయన మీద సంపూర్ణ గౌరవం ఉంది. సినిమా నటులు మనుషులు కాదా? వారికి ప్రేమ ఉండదా? సామాజిక బాధ్యత ఉండదా? నేను సినిమాల్లోకి రావాలని అనుకోలేదు.. కుదిరింది అంతే" అని అన్నారు పవన్.


ముద్రగడ సినిమా వాళ్ల సామాజిక బాధ్యతను శంకించలేదు. కేవలం పవన్ కల్యాణ్ ని మాత్రమే ఆయన టార్గెట్ చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ తర్వాత సినిమావాళ్లెవరూ రాజకీయాల్లో రాణించలేకపోయారనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. పరోక్షంగా చిరంజీవి ఫెయిల్యూర్ ని కూడా ముద్రగడ ప్రస్తావించారు. సినిమా వాళ్లు హైదరాబాద్ లోనే ఉంటారని, ఇక్కడకు రారని, స్థానికంగా ఉండే నాయకులనే ఎంపిక చేసుకోవాలని కూడా చెప్పారు. పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో అన్నీ వదిలేసి, పిఠాపురంకు కాపురం రావాలని డిమాండ్ చేశారు. అయితే పవన్ మాత్రం ముద్రగడ వ్యాఖ్యలను పూర్తిగా సినిమావాళ్లకు ఆపాదించినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారు. సినిమావాళ్లకు సామాజిక బాధ్యత లేదనుకుంటే ఎలా..? అని ప్రశ్నించారు జనసేనాని.

కాపుల్ని తాకట్టు పెట్టానా..?

"కాపులను తాకట్టు పెట్టేస్తున్నావ్‌ అని నాయకులు తనను విమర్శిస్తున్నారని, ఆ స్థాయి నాకు ఉంటే నేను ఎన్నికల్లో ఓడిపోతానా? ప్రభుత్వం స్థాపించలేనా?" అని లాజిక్ తీశారు పవన్. పరోక్షంగా కాపులు తనతో లేరనే విషయాన్ని ఆయన ఒప్పేసుకున్నారు. తాను ఎన్నిసార్లు సభలకు వచ్చినా అభిమానులు రోడ్లమీదికి వస్తున్నారని, చప్పట్లు కొడుతున్నారని, కానీ ఓట్లు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన గొంతు ఏపీ అసెంబ్లీలో వినిపిస్తే దానికి ఉండే శక్తి వేరన్నారు పవన్. 

Tags:    
Advertisement

Similar News