చంద్రగిరిలోని 16వ శతాబ్దపు ఇటుక రాతి దిగుడు బావిని కాపాడుకోవాలి

దిగుడు బావి రాతి కట్టడాన్ని ఇంత నైపుణ్యవంతంగా నిర్మించిన ఆధారం రాయలసీమలో ఇదొక్కటేనని, తర్వాత కాలంలో సాగునీటి కోసం వినియోగించినట్లుగా తెలిపే కట్టడాలను బట్టి చెప్పవచ్చు అన్నారు.

Advertisement
Update: 2024-04-29 05:19 GMT

తిరుపతి జిల్లాలోని చారిత్రక నగరం చంద్రగిరిలోని విజయనగర కాలపు ఇటుక రాతి దిగుడుబావిని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్ట‌ర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. తిరుపతికి చెందిన సూర్యదేవర హరికృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు, ఎస్.వి భక్తి ఛానల్ ప్ర‌తినిధి బి.వి. రమణతో కలిసి సోమవారం ఆయన ఆ బావిని సందర్శించారు. చంద్రగిరి కోటలో రాజమహల్ ఎదురుగా ప్రైవేటు వ్యక్తులకు చెందిన మామిడి తోటలో గల ఈ దిగుడు బావి 20 అడుగుల విస్తీర్ణంతో, 20 అడుగుల లోతుతో చుట్టూ ఇటుక రాతి గోడతో, దిగటానికి రాతిమెట్లతో నిర్మించబడిందని శివనాగిరెడ్డి చెప్పారు.

వృత్తాకారపు ఇటుక రాతి గోడపై, హంపిలోని రాతి దిగుడు బావి వాస్తు శిల్పశైలికి అద్దం పడుతున్న డిజైన్లు, మధ్యలో అలంకరణ పట్టిని అనుకరించి ఈ దిగుడు బావి క్రీ.శ. 16వ శతాబ్దికి చెందిందని, అప్పటి చంద్రగిరి రాజ కుటుంబీకులు తాగునీటి కోసం ఈ బావిని అద్భుతంగా నిర్మించారని ఆయన అన్నారు.

దిగుడు బావి రాతి కట్టడాన్ని ఇంత నైపుణ్యవంతంగా నిర్మించిన ఆధారం రాయలసీమలో ఇదొక్కటేనని, తర్వాత కాలంలో సాగునీటి కోసం వినియోగించినట్లుగా తెలిపే కట్టడాలను బట్టి చెప్పవచ్చు అన్నారు. అరుదైన, అద్భుత ఇటుక రాతి వాస్తు శిల్ప శైలి గల ఈ దిగుడు బావిని కాపాడి భవిష్యతరాలకు అందించాలని సూర్యదేవర హరికృష్ణకు, మామిడి తోట యజమానులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

చారిత్రక ప్రాధాన్యత గల బావి అంచుల్ని పునరుద్ధరించి, గోడల్ని శుభ్రపరిచి, భద్రతాపరమైన చర్యలు తీసుకుంటే, చంద్రగిరి రాజమహల్ తో పాటు ఈ దిగుడు బావిని కూడా పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దవచ్చని వారసత్వ ప్రేమికుడు బి.వి రమణ అన్నారు.

Tags:    
Advertisement

Similar News