చంద్రబాబుకు తలనొప్పిగా మారిన ఎంపీ రామ్మోహన్ నాయుడు?

తనకు బలమైన అనుచరుడిగా ఉండే అచ్చెన్నను వదులుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదు. అందుకే రామ్మోహన్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు.

Advertisement
Update: 2022-07-27 06:44 GMT

టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఇప్పుడు పార్టీ చీఫ్ చంద్రబాబుకు తలనొప్పిగా మారారు. రెండు సార్లు టీడీపీ ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడికి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఢిల్లీలో కూడా యువ ఎంపీగా మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఇక వైసీపీ ప్రభంజనంలో కూడా రెండోసారి శ్రీకాకుళం ఎంపీగా టీడీపీ తరపున గెలిచారు.

రెండు సార్లు ఎంపీగా గెలిచినా తనకు పార్టీలో గానీ, ప్రజల్లో గానీ తగినంత గుర్తింపు రావడం లేదని రామ్మోహన్ నాయుడు బాధపడుతున్నారు. కేంద్రం, రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉన్న సమయంలో తండ్రి ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా పని చేశారు. అప్పట్లో చంద్రబాబుకు ఎర్రన్నాయుడు చాలా సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. తండ్రి బాటలోనే ఎంపీ ఎన్నికల్లో నిలబడి రామ్మోహన్ నాయుడు విజయాలు సాధిస్తున్నారు. కానీ కేంద్రంలో టీడీపీ పాత్ర ఏమీ లేని ఈ సమయంలో ఎంపీగా ఉన్నా లాభం లేదని రామ్మోహన్ నాయుడు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

శ్రీకాకుళం ఎంపీగా ఉన్నా.. తనకు తగినంత గుర్తింపు రాష్ట్రంలో దొరకడం లేదని రామ్మోహన్ నాయుడు సన్నిహితుల దగ్గర బాధపడినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయమని, టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయని సూచించినట్లు సమాచారం. ఎర్రన్నాయుడు అభిమానులు, రామ్మోహన్ నాయుడు మద్దతుదారులు కూడా శాసన సభకు పోటీ చేస్తేనే తగినంత గుర్తింపు లభిస్తుందని చెప్తున్నారు. దీంతో తన మనసులోని మాటను చంద్రబాబు వద్ద రామ్మోహన్ నాయుడు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

రాబోయే ఎన్నికల్లో నరసన్నపేట నుంచి శాసన సభకు పోటీ చేస్తానని రామ్మోహన్ నాయుడు టీడీపీ అధినేతకు చెప్పారట. అయితే చంద్రబాబు ఆయన నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అచ్చెన్నాయుడు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న టెక్కలిని ఆనుకొనే నరసన్నపేట నియోజకవర్గం ఉంది. బాబాయ్ ఎలాగో టెక్కలి నుంచి బరిలో ఉంటాడు కాబట్టి తాను నరసన్నపేట నుంచి పోటీ చేస్తానని చంద్రబాబుకు రామ్మోహన్ నాయుడు వివరించారు.

అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కుటుంబాల మధ్య ఇప్పుడు పెద్దగా సఖ్యత లేదు. ఎర్రన్నాయుడు చనిపోయిన తర్వాత ఆయన వారసత్వాన్ని అచ్చెన్నాయుడు హైజాక్ చేశారని రామ్మోహన్ నాయుడు కోపంతో ఉన్నారు. ఈ సమయంలో ఇద్దరినీ అసెంబ్లీకి పోటీ చేయిస్తే అది పార్టీకే నష్టమని టీడీపీ నాయకులు చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తుంది. అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయించమని కూడా రామ్మోహన్ సూచించినా.. చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదని సమాచారం. తనకు బలమైన అనుచరుడిగా ఉండే అచ్చెన్నను వదులుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదు. అందుకే రామ్మోహన్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు.

మరోవైపు శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ పోటీ చేయకపోతే మరో కొత్త వ్యక్తిని వెతకడం టీడీపీకి కష్టమే. మరోవైపు ఇద్దరికీ ఎమ్మెల్యే సీట్లు ఇస్తే.. వాళ్లు గెలిస్తే.. మంత్రి పదవుల దగ్గర అయినా గొడవలు పడతారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఈ సారి కూడా ఎంపీగా పోటీ చేయమని.. తన భవిష్యత్ స్వయంగా చూసుకుంటానని చంద్రబాబు మాటిచ్చారని సమాచారం.

చంద్రబాబు బుజ్జగించినా రామ్మోహన్ నాయుడు వినలేదని.. నర‌స‌న్నపేట నుంచి బరిలోకి దిగడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నియోజకవర్గ ఇంచార్జి రమణమూర్తి కూడా రామ్మోహన్ నాయుడు వైపే మొగ్గు చూపిస్తున్నారు. రామ్మోహన్‌కే మద్దతు ఇస్తున్నట్లు కూడా బహిరంగంగా ప్రకటించారు. ఇలా శ్రీకాకుళం జిల్లాలో కింజరపు ఫ్యామిలీ చంద్రబాబుకు తలనొప్పిగా మారిందని.. రామ్మోహన్ వ్యవహార శైలితో చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

Tags:    
Advertisement

Similar News