టీడీపీలో ఆరని చిచ్చు.. భువనేశ్వరికీ తప్పని అసమ్మతి సెగ

అనకాపల్లి రూరల్‌ మండల అధ్యక్షుడు పచ్చికూర రాము ఆధ్వర్యంలో నాయకులు దాదాపు 10 నిమిషాల పాటు రోడ్డుకు అడ్డంగా నిలబడి భువనేశ్వరి కారును అడ్డుకున్నారు.

Advertisement
Update: 2024-03-01 07:14 GMT

అభ్యర్థుల ఖరారులో చంద్రబాబు అనుసరించిన విధానంతో టీడీపీలో తలెత్తిన అసమ్మతి సెగలు చల్లారడం లేదు. రోజు రోజుకీ అసంతృప్తి సెగ జ్వాల‌గా మారుతోంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి కూడా అసమ్మతి సెగ తప్పలేదు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరిని యలమంచిలి వెళ్లే దారిలో పీల గోవింద సత్యనారాయణ వర్గానికి చెందినవారు అడ్డుకున్నారు. అనకాపల్లి రూరల్‌ మండల అధ్యక్షుడు పచ్చికూర రాము ఆధ్వర్యంలో నాయకులు దాదాపు 10 నిమిషాల పాటు రోడ్డుకు అడ్డంగా నిలబడి భువనేశ్వరి కారును అడ్డుకున్నారు. పీలా గోవిందకే టికెట్‌ ఇవ్వాలని నినాదాలు చేశారు. దాంతో భువనేశ్వరి కారు దిగి ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు. దాంతో వారు తప్పుకున్నారు.

అనకాపల్లి సీటును జనసేన నాయకుడు కొణతాల రామకృష్ణకు కేటాయించడంపై టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అనకాపల్లి టీడీపీ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాను పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడితే తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దానికితోడు కొణతాల రామకృష్ణ తనను కాదని తనకు వ్యతిరేకవర్గమైన బుద్ధా నగేశ్‌ను కలవడంపై కూడా ఆయన ఆగ్రహంతో ఉన్నారు.

అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని కాదని అన్నా క్యాంటీన్‌ అంటూ హంగామా చేసిన సవితకు టికెట్‌ ఇవ్వడంపై నిరసనలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్థసారథికి టికెట్‌ ఇవ్వకపోతే టీడీపీని ఓడిస్తామని వారంటున్నారు.

శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో మాజీ ఎమ్యెల్యే ఈరన్న కుమారుడు సునీల్‌ కుమార్‌కు టికెట్‌ ఇవ్వడాన్ని గుండుమల తిప్పేస్వామి జీర్ణించుకోలేకపోతున్నారు. తిప్పేస్వామి వర్గం గురువారం మరోసారి నిరసనకు దిగింది. సునీల్‌ను మార్చకపోతే తామంతా రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ టికెట్‌ తనకు దక్కకపోవడంపై బొల్లినేని వెంకటరామారావు మండిపడుతున్నారు. టీడీపీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఆయన వర్గం సిద్ధపడుతోంది. టికెట్‌ విషయంలో తనకు న్యాయం జరగకపోతే మార్చి 2వ తేదీన చంద్రబాబును కలిసి భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటానని ఆయన చెప్పుతున్నారు.

Tags:    
Advertisement

Similar News