రెండు నెలలు జనాల్లోనే ఉండబోతున్న చంద్రబాబు

జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత లోకేష్ పాదయాత్ర మొదలవబోతోంది. కుప్పం నుండి మొదలయ్యే పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగుస్తుంది. లోకేష్ పాదయాత్ర మొదలయ్యే సమయానికి తన రాష్ట్రవ్యాప్త పర్యటన పూర్తిచేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
Update: 2022-11-01 05:46 GMT

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు చంద్రబాబు నాయుడు జనాల్లోకి వెళ్ళబోతున్నారు. రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే పర్యటనలకు నవంబర్ 4వ తేదీన శ్రీకారం చుట్టబోతున్నారు. చంద్రబాబు పర్యటనల రూటుమ్యాప్ తయారు చేయటానికి, అవసరమైన ఏర్పాట్లు చేయటానికి పార్టీ హెడ్ ఆపీసులో ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మే నెలలో జరిగిన మహానాడులో రాష్ట్రంలోని అన్నీ పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించాలని డిసైడ్ చేశారు.

రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటనలు అయిన తర్వాత వర్షాలు, తుపాను తదితర కారణాల వల్ల పర్యటన అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఇప్పుడు ఆ సమస్యలు ఏవీ లేవుకాబట్టి మళ్ళీ పర్యటనలు చేయాలని నిర్ణయించారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో మిగిలిపోయిన పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి జనాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదలిక తీసుకురావాలన్నది చంద్రబాబు ఆలోచన. ప్రజావ్యతిరేకత నిర్ణయాల వల్ల జనాలు చాలామంది ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోని వైనాన్ని చంద్రబాబు హైలైట్ చేయబోతున్నారు.

రాష్ట్రంలోని రోడ్ల దుస్ధితి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోవటం, నిత్యావసరాల ధరలు పెరిగిపోతుండటం, పరిశ్రమలు రాకపోవటం, కరెంటు ఛార్జీల పెంపు, ఎస్సీ, ఎస్టీలపైన జరుగుతున్న దాడులు లాంటి అనేక అంశాలపై జనాల్లో విస్తృతంగా చర్చ జరిగేట్లు చూడాలన్నదే చంద్రబాబు ఆలోచన. పై అంశాలన్నింటిపైనా జనాలతో డైరెక్టుగా మాట్లాడటమే చంద్రబాబు పర్యటనల ముఖ్య ఉద్దేశం.

జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత లోకేష్ పాదయాత్ర మొదలవబోతోంది. కుప్పం నుండి మొదలయ్యే పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగుస్తుంది. లోకేష్ పాదయాత్ర మొదలయ్యే సమయానికి తన రాష్ట్రవ్యాప్త పర్యటన పూర్తిచేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అంటే లోకేష్ పాదయాత్రకు చంద్రబాబు పార్లమెంటు నియోజకవర్గాల పర్యటన ట్రైల్ రన్ అని అనుకోవచ్చు. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పార్టీ నేతలు, క్యాడర్‌ను సిద్ధం చేయటమే చంద్రబాబు అసలు ఉద్దేశ్యంగా అర్దమవుతోంది.

Tags:    
Advertisement

Similar News