లోకేష్‌కు కార్యకర్త షాకిచ్చారా?

కుప్పంలో పార్టీ పరిస్థితి ఏమీ బాగాలేదన్నారు. వాళ్ళ అవసరాల కోసం ఎవరెవరో ఏదేదో చెబుతుంటారని వాటని నమ్మితే కష్టమే అన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్నది వాస్తమన్నారు.

Advertisement
Update: 2023-01-29 05:18 GMT

అందరిముందే నారా లోకేష్‌కు ఒక కార్యకర్త పెద్ద షాకిచ్చారు. శాంతిపురం మండలంలోని బీసీ నేతలతో యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు. తర్వాత పార్టీ పరిస్ధితి, వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబునాయుడును గెలిపించుకునేందుకు అందరు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని లోకేష్ నొక్కి చెప్పారు. తర్వాత కొందరు నేతలు మాట్లాడుతూ చంద్రబాబు విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని చెప్పారు.

అయితే కొందరు నేతల తర్వాత ఒక కార్యకర్త మాట్లాడుతూ చంద్రబాబు గెలుపుపై నేతలు చెప్పిందంతా అబద్ధాలే అన్నారు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అంతా బ్రహ్మాండమని చాలామంది చెప్పారని అయితే వాళ్ళు చెప్పిందంతా ఉత్త అబద్దమే అని బల్లగుద్ది మరీచెప్పారు. కుప్పంలో పార్టీ పరిస్థితి ఏమీ బాగాలేదన్నారు. వాళ్ళ అవసరాల కోసం ఎవరెవరో ఏదేదో చెబుతుంటారని వాటని నమ్మితే కష్టమే అన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్నది వాస్తమన్నారు.

తాను చెబుతున్నది కూడా నమ్మాల్సిన అవసరంలేదని సొంతంగా నియోజకవర్గంలో విచారించుకుంటే వాస్తవాలు తెలుస్తాయని గట్టిగానే చెప్పారు. అందరిముందు పార్టీ పరిస్థితిపై కార్యకర్త ఇలాగ చెబుతారని అనుకునుండరు. దాంతో లోకేష్ సదరు కార్యకర్త దగ్గర నుండి మైకును తీసేసుకున్నారు. ఆ కార్యకర్త ఇంకా ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా లోకేష్ అవకాశం ఇవ్వలేదు. లోకేష్, నేతలు మాట్లాడిన మాటలకు, సదరు కార్యకర్త చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా ఉండటాన్ని సమావేశంలోని అందరూ స్పష్టంగా విన్నారు.

కార్యకర్త చెప్పిందానికి గతంలో స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు సరిగ్గా సరిపోతున్నాయి. అప్పటి నుండి ఇప్పటివరకు పార్టీ పటిష్టానికి చంద్రబాబునాయుడు తీసుకున్న చర్యలు ఏమీలేవు. అప్పట్లో పార్టీపై పెత్తనం వహిస్తున్నారంటూ ఎవరిమీదైతే ద్వితీయశ్రేణి నేతలు, మామూలు కార్యకర్తలు మండిపోయారో ఇప్పుడూ వాళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారు. టీడీపీ ఓటమికి కారణాలని కొందరు నేతలు, కార్యకర్తలు ఎవరిమీదైతే ఆరోపణలు చేశారో ఇప్పుడు కూడా వాళ్ళే కీలకంగా ఉన్నారు. బహుశా ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే సదరు కార్యకర్త పార్టీ పరిస్థితి బాగాలేదని చెప్పినట్లున్నారు.

Tags:    
Advertisement

Similar News