పవన్‌కల్యాణ్‌ నీకిది తగునా.. సోషల్‌మీడియాలో సెటైర్లు

చంద్రబాబు అరెస్టు విషయంలో ఆయన సొంత కొడుకు లోకేష్‌ సైతం ఇంతలా నిరసన తెలియజేయలేదంటూ పవన్‌పై సెటైర్లు వేస్తున్నారు.

Advertisement
Update: 2023-09-10 02:27 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు విషయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. సోషల్‌మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు, ట్రోల్స్‌ నడుస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ విజయవాడకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. మొదట స్పెషల్‌ ఫ్లైట్‌లో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రావడానికి ప్రయత్నించగా తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పవన్‌కల్యాణ్ ఫ్లైట్ ఎక్కడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన రోడ్డు మార్గంలో విజయవాడకు బయల్దేరారు. అయితే ఏపీ సరిహద్దుకు చేరుకున్నాక అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ దగ్గర ప‌వ‌న్‌ వాహనాలను నిలిపివేశారు. దీంతో పవన్‌కల్యాణ్ రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపారు.

ఇదే విషయంపై ఇప్పుడు సోషల్‌మీడియాలోనూ పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్టు విషయంలో ఆయన సొంత కొడుకు లోకేష్‌ సైతం ఇంతలా నిరసన తెలియజేయలేదంటూ పవన్‌పై సెటైర్లు వేస్తున్నారు. సొంత పార్టీ కోసం జనసేనాని ఏనాడూ ఇంత కష్టపడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షలాది కార్యకర్తల అభిమానాన్ని పవన్‌కల్యాణ్‌.. చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టుపెడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన అవతరించే అవకాశాలు ఉన్నప్పటికీ పవన్‌కల్యాణ్ వినియోగించుకోవట్లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుకు పవన్‌కల్యాణ్‌ దత్తపుత్రడనే వైసీపీ నేతల మాటను పవన్‌ నిజం చేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. జగన్‌ అవినీతి చేశాడంటూ పదేపదే విమర్శలు చేసే పవన్‌కల్యాణ్.. చంద్రబాబును వెనకేసుకు రావడంలో మతలబేంటని ప్రశ్నిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఒక్క సీటైనా గెలిచిందని.. పవన్‌ తీరు మారకపోతే ఈ సారి ఆ ఒక్క స్థానం కూడా దక్కే అవకాశాలు లేవని జోస్యం చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News