ఇది మూడు ముక్కల ప్రభుత్వం.. ఆయన మూడు ముక్కల సీఎం

ప్యాకేజీ అంటే చెప్పుతీసుకుని కొడతానంటూ గతంలో చెప్పు చూపించిన పవన్ కల్యాణ్, ఈసారి జనసైనికుల చెప్పుతో, వీర మహిళల చెప్పుతో కొడతానని హెచ్చరించారు.

Advertisement
Update: 2023-01-12 17:45 GMT

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన యువశక్తి సభలో పాల్గన్న జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై, అధికార పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు రాజధానులపై కూడా పంచ్‌ లు విసిరారు. ఏపీలో ఉన్నది మూడు ముక్కల ప్రభుత్వం అని, పాలించేది మూడు ముక్కలు ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు.

రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయకూడదా..?

రాజకీయ నాయకులకు వారసత్వంగా వచ్చిన ఆస్తులైనా ఉండాలి, లేదా వ్యాపారాలైనా ఉండాలి, అలా ఉంటేనే పార్టీకోసం, కుటుంబంకోసం బతకగలరు అని అన్నారు పవన్ కల్యాణ్. తనకు సినిమాలు తప్ప వేరేది తెలియదని, అందుకే జరుగుబాటుకోసం సినిమాలు చేస్తున్నానని చెప్పారు. కపిల్ సిబల్, చిదంబరం రాజకీయాల్లో ఉంటూ లాయర్ ప్రాక్టీస్ చేయడం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో రాజకీయ నాయకులు వ్యాపారాలు చేయట్లేదా అని అడిగారు. కాంట్రాక్టులు చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చా, సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయకూడదా అని నిలదీశారు. డబ్బు అవసరం లేని సమయం వచ్చినప్పుడు సినిమాలతో సహా మొత్తం వదిలేస్తానని స్పష్టం చేశారు పవన్.

నా చెప్పుకాదు, వారి చెప్పుతో కొడతా..

ప్యాకేజీ అంటే చెప్పుతీసుకుని కొడతానంటూ గతంలో చెప్పు చూపించిన పవన్ కల్యాణ్, ఈసారి కూడా ప్యాకేజీ అనే మాటపై తీవ్రంగా స్పందించారు. ప్యాకేజీ అంటే ఈసారి జనసైనికుల చెప్పుతో, వీర మహిళల చెప్పుతో కొడతానని హెచ్చరించారు.

పిరికితనం అంటే తనకు చిరాకు అని, యువత కోసం, రాష్ట్రం కోసం అవసరం అయితే ప్రాణ త్యాగానికి సిద్ధమని ప్రకటించారు పవన్ కల్యాణ్. ఆఖరి శ్వాస వరకు రాజకీయాలను వదలను, ప్రజల్ని కూడా వదలబోనన్నారు పవన్. స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఆజాద్ ఆత్మత్యాగాలు చేస్తే, మనం సాటి మనుషులకోసం ఏం చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. గెలుస్తానో ఓడిపోతానో కాదు, నాకు పోరాటమే తెలుసు.. వెధవల్ని ఎదుర్కోవడం, గూండాలను‌ తన్నడం కూడా తెలుసని హెచ్చరించారు పవన్.

తాను కులనాయకుడిని‌ కాదని, ఒక్క కులం కోసం కాదు, ఏపీ, తెలంగాణ అందరూ బావుండాలని కోరుకునే వ్యక్తిని తానన్నారు పవన్. వైసీపీని కేవలం ఒక్క కులంతోనే నింపేసు‌కుంటున్నారని విమర్శించారు. పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి, సాయంత్రం సారాతో పట్టుకు పోతున్నారని ఆరోపించారు. మంచి వ్యక్తిత్వం ఉన్న వారిని గౌరవిస్తానని, జైలులో ఉన్నవారిని కాదన్నారు పవన్. తాను ఒకతరాన్ని మేలు కొలుపుతున్నానని, జనసేన అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామని, వలసలు లేకుండా చేస్తామన్నారు.

Tags:    
Advertisement

Similar News