ముద్రగడను అవమానించిన పవన్‌.. రగిలిపోతున్న కాపులు..

రాజమండ్రి వచ్చినప్పుడు పవన్‌ కల్యాణ్‌ కిర్లంపూడి వెళ్లి ముద్రగడను కలుస్తారని జనసేన నాయకులు ప్రచారం చేశారు.

Advertisement
Update: 2024-02-23 08:50 GMT

జనసేన పవన్‌ కల్యాణ్‌ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని అవమానించారనే అభిప్రాయం బలపడుతోంది. ముద్రగడను పవన్‌ కల్యాణ్‌ కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ముద్రగడను కలిసే ఉద్దేశం కూడా పవన్‌ కల్యాణ్‌కు ఉన్నట్లు లేదు. రాజమండ్రి వ‌ర‌కు వచ్చి కూడా ఆయన కిర్లంపూడి వెళ్లలేదు. పైగా, ఇతర నాయకులను కలుస్తూ వెళ్లారు.

కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని వదిలేసిన‌ ముద్రగడ పద్మనాభం రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. ఈ స్థితిలో పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జీ బొలిశెట్టి శ్రీనివాస్‌, వరుపుల తమ్మయ్యబాబు, మరికొంత మంది ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని వారు ఆయనను కోరారు. అందుకు ముద్రగడ కూడా ఆసక్తి ప్రదర్శించినట్లు వార్తలు వచ్చాయి. రెండు మూడుసార్లు వారు ముద్రగడను కలిశారు. ముద్రగడను పవన్‌ కల్యాణ్‌ కలుస్తారని, ఈ భేటీ జరిగిన వెంటనే ముద్రగడ జనసేనలో చేరుతారని అనుకున్నారు. కానీ అది జరగలేదు.

రాజమండ్రి వచ్చినప్పుడు పవన్‌ కల్యాణ్‌ కిర్లంపూడి వెళ్లి ముద్రగడను కలుస్తారని జనసేన నాయకులు ప్రచారం చేశారు. పవన్‌ కల్యాణ్‌ విశాఖలో పర్యటించి ఆదివారంరాత్రి కొణతాల రామకృష్ణను కలిశారు. అక్కడి నుంచి సోమవారం సాయంత్రానికి రాజమండ్రి వచ్చారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి మంగళగిరి వెళ్లారు. ఆ తర్వాత బుధవారంనాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవ‌రం వెళ్లారు. ఆ పర్యటనలో ఆయన టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మిని, మరికొంత మందిని కలిశారు. ఈ మొత్తం పర్యటనలో పవన్‌ కల్యాణ్‌ కిర్లంపూడి ఊసు కూడా ఎత్తలేదు.

రాజమండ్రి నుంచి కిర్లంపూడి కేవలం 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ, ఆయన వెళ్లలేదు. కావాలనే పవన్‌ కల్యాణ్‌ ముద్రగడను కలుసుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముద్రగడను పవన్‌ కల్యాణ్‌ అవమానిస్తున్నారని కాపు సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News