టీడీపీలో బొమ్మల గోల.. వైసీపీకి సెల్ఫ్ గోల్స్ అవసరమా..?

మహానాడులో టీడీపీ నేతల ప్రసంగాలేవీ హైలెట్ కాకపోయినా మహానాడుకి కౌంటర్ గా వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర నాయకులు పేల్చిన పంచ్ డైలాగులే బాగా హైలెట్ కావడం ఇక్కడ విశేషం.

Advertisement
Update: 2023-05-29 13:14 GMT

మహానాడు బ్యానర్లో బాలకృష్ణ బొమ్మ ఎందుకు పెట్టలేదు, అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ఎందుకు వేయలేదు..? ఈ ప్రశ్నలు అడగాల్సింది ఎవరు..? తన ఫొటో పెట్టకపోయినా బావ పక్కన సంతోషంగా కనపడ్డారు బాలయ్య, ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే మాటలు ప్రతి రోజూ చెవిన పడుతూనే ఉన్నా బాలకృష్ణ సహా నందమూరి కుటుంబ సభ్యులెవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి మధ్యలో వైసీపీకి ఉలుకెందుకు..? మహానాడు బ్యానర్లో బాలయ్య బొమ్మ, జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ లేకపోతే వైసీపీకి వచ్చిన నష్టమేంటి..? అసలీ బొమ్మల గోల మొదలు పెడితే వైసీపీ బ్యానర్లని కూడా టీడీపీ ఏకిపారేయడం మొదలు పెడుతుంది, లేనిపోని ఈ సెల్ఫ్ గోల్స్ వైసీపీకి అవసరమా..?

రాజకీయాల్లో పాతనీరు పోతుంది, కొత్తనీరు వస్తుంది. కానీ టీడీపీకి ఎన్టీఆర్ పేరు చెప్పుకోవడం అవసరం. అందులోనూ ఎన్నికల సమయంలో ఆ పేరు చంద్రబాబుకి అత్యవసరం. అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్న అంటూ తనని తాను హైలెట్ చేసుకున్నా, ఆ మత్తు దిగాక ఇప్పుడు తిరిగి ఎన్టీఆర్ జపం చేయడం చంద్రబాబుకి తప్పనిసరి అయింది. ఇందులో అనుమానమేమీ లేదు, టీడీపీలో కూడా ఎవరూ ఈ విషయాన్ని ఖండించరు. వైసీపీ బ్యానర్లలో విజయమ్మ, షర్మిల ఫొటోలు గతంలో ఘనంగా కనపడేవి. ఇప్పుడెందుకు వారిద్దర్నీ పక్కనపెట్టారు. ఇది కూడా బహిరంగ రహస్యమే. ఆమధ్య మంత్రి రోజాపై కూడా ఇదే విషయంపై పంచ్ డైలాగులు వేశారు టీడీపీ నేతలు. నగరిలో విజయమ్మ ఫొటోతో బ్యానర్ వేసే దమ్ము రోజాకి ఉందా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రోజాయే కాదు, వైసీపీలో ఎవరూ సమాధానమివ్వలేరు, అలాగని విజయమ్మకి లేదా షర్మిలకోసం బ్యానర్లు కట్టే సాహసమూ చేయలేరు. సమాధానం తమ దగ్గర లేనప్పుడు టీడీపీని పదే పదే కదిలించి సెల్ఫ్ గోల్ వేసుకోవడం అవసరమా..?

మహానాడు మొదలైన తర్వాత వైసీపీనుంచి వరుస కామెంట్లు వినపడుతున్నాయి. టీడీపీ మీటింగ్ లో జగన్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, మేనిఫెస్టోలోవి అన్నీ కాపీ పథకాలేనని, అసలు మహానాడులో అంతా స్క్రాప్ తేలిందని.. రకరకాల సెటైర్లు పేలాయి. అన్నిటిలో ఎంతో కొంత విషయం ఉంది. కానీ టీడీపీ బ్యానర్లలో కూడా ఎవరెవరి తలకాయలుండాలి అనేది వైసీపీ నిర్ణయించడం ఎంతవరకు కరెక్ట్, అలాంటి విమర్శలతో జనం సంతోషిస్తారా..? గొప్ప లాజిక్ వెతికారంటూ వైసీపీ నేతల్ని మెచ్చుకుంటారా..? అనేది ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవాలి. మొత్తమ్మీద మహానాడులో టీడీపీ నేతల ప్రసంగాలేవీ హైలెట్ కాకపోయినా మహానాడుకి కౌంటర్ గా వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర నాయకులు పేల్చిన పంచ్ డైలాగులే బాగా హైలెట్ కావడం ఇక్కడ విశేషం. 

Tags:    
Advertisement

Similar News