సిక్కోలు టీడీపీలో చిచ్చు.. ఇండిపెండెంట్లుగా సీనియర్లు..?

ఎచ్చెర్ల నుంచి మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు, పాతపట్నం నుంచి కలమట వెంకటరమణ, శ్రీకాకుళం నుంచి గుండా లక్ష్మీదేవి స్వతంత్రులుగా బరిలో ఉండేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement
Update: 2024-03-26 05:55 GMT

సిక్కోలు టీడీపీలో చిచ్చు రేగింది. ప్రధానంగా పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు.. చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీంతో వీరంతా స్వతంత్రులుగా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ఎచ్చెర్ల సీటును బీజేపీకి ఇస్తారని ప్రచారం జరుగుతుండగా.. శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో అనూహ్యంగా అభ్యర్థులను మార్చడంతో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. శ్రీకాకుళం సీటు తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి భావించారు. కానీ, చంద్రబాబు అనూహ్యంగా గొండు శంకర్‌కు అవకాశమిచ్చి లక్ష్మీదేవి ఆశలపై నీళ్లు చల్లారు. ఇక పాతపట్నం సీటు తనదేనని ధీమాతో ఉన్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు షాకిచ్చారు బాబు. ఆయన స్థానంలో మామిడి గోవిందరావుకు టికెట్ ఇచ్చారు. దీంతో కలమట.. పార్టీ హైకమాండ్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ 3 నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. పాత, కొత్త నేతల మధ్య సయోధ్య సాధ్యమయ్యే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించట్లేదు.

మూడు నియోజకవర్గాల్లో టికెట్‌ రాని సీనియర్లు నేతలు ఇండిపెండెంట్లుగా దిగేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఎచ్చెర్ల నుంచి మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు, పాతపట్నం నుంచి కలమట వెంకటరమణ, శ్రీకాకుళం నుంచి గుండా లక్ష్మీదేవి స్వతంత్రులుగా బరిలో ఉండేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు తమకు టికెట్ రాకపోవడానికి ఏపీ టీడీపీ చీఫ్, సీనియర్ నేత అచ్చెన్నాయుడే కారణమని వీరంతా మండిపడుతున్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని.. అలాంటిది తమను పక్కనపెట్టడం ఏంటని మండిపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News