నాయీ బ్రాహ్మ‌ణుల‌కు దేశ చ‌రిత్ర‌లోనే అరుదైన గౌర‌వం.. - జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం

ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌పై నాయీ బ్రాహ్మ‌ణ సంఘాల నేత‌లు స్పందిస్తూ.. తాజా ఆర్డినెన్స్‌తో నాయీ బ్రాహ్మ‌ణుల‌కు దేశ చ‌రిత్ర‌లోనే అరుదైన గౌర‌వం ద‌క్కిందని సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Update: 2023-02-07 02:53 GMT

దేవ‌దాయ శాఖ ప‌రిధిలోని ఆల‌యాల ట్ర‌స్టు బోర్డు స‌భ్యుల నియామ‌కాల్లో నాయీ బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం నుంచి ఒక‌రికి త‌ప్పనిస‌రిగా స్థానం క‌ల్పించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ సోమ‌వారం ప్ర‌త్యేక ఆర్డినెన్స్ జారీ చేశారు. దీంతో బీసీల‌కు ఇచ్చిన మ‌రో హామీని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నెర‌వేర్చిన‌ట్ట‌యింది. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌పై నాయీ బ్రాహ్మ‌ణ సంఘాల నేత‌లు స్పందిస్తూ.. తాజా ఆర్డినెన్స్‌తో నాయీ బ్రాహ్మ‌ణుల‌కు దేశ చ‌రిత్ర‌లోనే అరుదైన గౌర‌వం ద‌క్కిందని సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌కు ఇచ్చిన హామీని నెర‌వేర్చిన సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్‌..

అనాదిగా ఆల‌యాల వ్య‌వ‌స్థ‌లో అర్చ‌కుల‌కు విడ‌దీయ‌రాని బంధం ఉందని దేవ‌దాయ శాఖ వ‌ర్గాలు ఈ సంద‌ర్భంగా పేర్కొన్నాయి. ఆల‌యాల్లో భ‌జంత్రీలుగా, క్షుర‌కులుగా, ప్ర‌త్యేక ఉత్స‌వాల స‌మ‌యంలో స్వామివారి ప‌ల్ల‌కీ సేవ‌ల్లో నాయీ బ్రాహ్మ‌ణులు పాలుపంచుకుంటున్నార‌ని వారు గుర్తుచేస్తున్నారు. ఆల‌యాల్లో ప‌లు కార్య‌క‌లాపాల్లో సేవ‌లందించే త‌మ‌కూ పాల‌క‌వ‌ర్గాల్లో చోటు క‌ల్పించాల‌ని నాయీ బ్రాహ్మ‌ణులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు.

పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీ..

సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న పాద‌యాత్ర సంద‌ర్భంగా నాయీ బ్రాహ్మ‌ణుల‌కు ఈ అంశంపై సానుకూల హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ నిర్వ‌హించిన బీసీ గ‌ర్జ‌న స‌భ‌ల్లోనూ దీనిపై ప్ర‌త్యేకంగా చ‌ర్చ జ‌రిగింది. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తూ దేవ‌దాయ శాఖ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ తెచ్చి ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.

త్వ‌ర‌లో నియామ‌కాలు..

హైకోర్టు ఇటీవ‌ల వెలువ‌రించిన తీర్పు ప్ర‌కారం.. రూ.5 ల‌క్ష‌ల‌కు పైగా ఆదాయం వ‌చ్చే ఆల‌యాల‌కే దేవ‌దాయ శాఖ ట్ర‌స్టు బోర్డుల‌ను నియ‌మించే అవ‌కాశం ఉంది. రాష్ట్రంలో అలాంటి ఆల‌యాలు 1,234 ఉన్న‌ట్టు స‌మాచారం. వాటిలో ఇప్ప‌టికే ప‌లు ఆల‌యాల‌కు ట్ర‌స్టు బోర్డు నియామ‌కాలు పూర్త‌యిన‌వాటిని మిన‌హాయిస్తే.. మ‌రో 610 ఆల‌యాల‌కు కొద్ది రోజుల్లో ట్ర‌స్టు బోర్డులో స్థానం క‌ల్పించే అవ‌కాశ‌ముంది.

నాడు చంద్ర‌బాబు హ‌యాంలో అవ‌మానం..

టీడీపీ హ‌యాంలో తాము అవ‌మానాల‌ను ఎదుర్కోగా.. నేడు త‌మ‌కు స‌ముచిత స్థానం ద‌క్కింద‌ని నాయీ బ్రాహ్మ‌ణ సంఘాలు పేర్కొంటున్నాయి. నాడు స‌చివాల‌యంలో త‌న‌ను క‌లిసి స‌మ‌స్య‌లు వినిపించిన సంఘాల నేత‌ల‌నుద్దేశించి `తోక‌లు క‌త్తిరిస్తా.. ఆల‌యాల మెట్లు కూడా ఎక్క‌కుండా చేస్తా..` అంటూ చంద్ర‌బాబు తీవ్ర స్వ‌రంతో హెచ్చ‌రించిన విష‌యాన్ని వారు గుర్తుచేస్తున్నారు.

మ‌రో మెట్టు ఎక్కించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం..

నాయీ బ్రాహ్మ‌ణుల‌కు దేశ చ‌రిత్ర‌లోనే అరుదైన గౌర‌వం అందించ‌డం ద్వారా జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌మ‌ను మ‌రో మెట్టు ఎక్కించింద‌ని నాయీ బ్రాహ్మ‌ణ సంఘాల రాష్ట్ర నేత‌లు సిద్ద‌వ‌టం యానాద‌య్య‌, గుంటుప‌ల్లి రామ‌దాసు చెబుతున్నారు. సీఎం జ‌గ‌న్‌కు నాయీ బ్రాహ్మ‌ణ జాతి రుణ ప‌డి ఉంటుంద‌ని పేర్కొంటున్నారు.

Tags:    
Advertisement

Similar News