ధర్మాన బ్రదర్స్.. రాజీనామా స్టేట్ మెంట్స్..

మొత్తానికి తాను కూడా రాజీనామా చేస్తాను, తనకి కూడా ఎమ్మెల్యే పదవి తృణప్రాయం అని చెప్పడానికే కృష్ణదాస్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చారని అర్థమవుతోంది. రెండు రోజుల గ్యాప్ లో ఇలా అన్నదమ్ములిద్దరూ రాజీనామా చేస్తాననడం మాత్రం విశేషం.

Advertisement
Update: 2022-10-23 04:51 GMT

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ధర్మాన ఫ్యామిలీ ప్రస్తుతం రైజింగ్ లో ఉంది. జగన్ టీమ్-1లో ధర్మాన కృష్ణదాస్, టీమ్-2లో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవులు పొందారు. వైఎస్ఆర్ హయాంలో కూడా ధర్మాన ఫ్యామిలీకి మంత్రి పదవులు దక్కాయి. ప్రస్తుతం ఆ బంధం కొనసాగుతోంది, అయితే ఇప్పుడు సడన్ గా అన్నదమ్ములిద్దరూ రాజీనామా స్టేట్‌మెంట్లిచ్చారు. ఒకరు ఉత్తరాంధ్రకోసం రాజీనామా చేస్తానంటే, ఇంకొకరు జగన్ సీఎం పదవికోసం తన ఎమ్మెల్యే పదవిని సైతం తృణప్రాయంగా వదిలేస్తానంటున్నారు.

ఉత్తరాంధ్ర హీరో ఎవరు..?

విశాఖకు పరిపాలన రాజధాని తరలిస్తే.. ఉత్తరాంధ్ర ఏపీకి కీలకంగా మారుతుంది. ఇప్పటికే అక్కడ వైసీపీలో పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు ఉన్నా కూడా పార్టీ తరపున అక్కడ స్థానికేతరులకే పెత్తనం ఇస్తూ వచ్చారు సీఎం జగన్. ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్ లుగా నమ్మకస్తులనే పెట్టారు. ఇప్పుడు రాజధాని విషయంలో ఉత్తరాంధ్ర లోకల్ లీడర్లంతా తమ ప్రతాపం చూపించాలనుకుంటున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటుతో హడావిడి మొదలైంది. ఈ దశలో రాజీనామాలు కూడా తెరపైకి వచ్చాయి. ఉత్తరాంధ్రకు రాజధాని రాకపోతే తొలి రాజీనామా తనదేనంటూ ఆమధ్య కరణం ధర్మశ్రీ స్టేట్ మెంట్ ఇచ్చారు. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా కూడా చేసి ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏకంగా తన పదవిని త్యాగం చేస్తానంటూ ముందుకొచ్చారు. సీఎం జగన్ ఆయన్ను వారించారని, తొందరపడొద్దని సూచించారని కూడా వార్తలొచ్చాయి. అసలు అధికారంలో ఉన్న పార్టీ నేతలు రాజధాని కావాలంటూ ఇలా రాజీనామాలకు సిద్ధపడటం ఏంటో.. 151 సీట్లు ఉన్న అధికార పార్టీ రాజధాని ఏర్పాటు విషయంలో నాన్ పొలిటికల్ జేఏసీ మద్దతు కోరడం ఏంటో.. ఇదంతా విచిత్రంగానే ఉన్నా, రాజీనామాల స్టేట్ మెంట్లు మాత్రం నాయకుల పరపతి పెంచుతున్నాయి.

జగన్ కోసం రాజీనామా..

ఉత్తరాంధ్ర రాజధానికోసం మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేస్తాననడం ఎంత విడ్డూరంగా ఉందో, జగన్ సీఎం కాకపోతే తాను ఎమ్మెల్యే పదవిని సైతం త్యాగం చేస్తానంటూ ధర్మాన కృష్ణదాస్ స్టేట్ మెంట్ కూడా అంతే విచిత్రంగా తోస్తుంది. వచ్చే ఎనికల్లో జగన్ 175 నియోజకవర్గాలను టార్గెట్ పెట్టుకున్నారు. ప్రస్తుతానికి వైసీపీకి ఎదురుగాలి వీచే పరిస్థితి లేదనే అంటున్నాయి సర్వేలు. ఈ దశలో జగన్ కోసం కృష్ణదాస్ రాజీనామా స్టేట్ మెంట్ ఎందుకో అర్థం కావడంలేదు. మొత్తానికి తాను కూడా రాజీనామా చేస్తాను, తనకి కూడా ఎమ్మెల్యే పదవి తృణప్రాయం అని చెప్పడానికే ఈ స్టేట్ మెంట్ అని అర్థమవుతోంది. రెండు రోజుల గ్యాప్ లో ఇలా అన్నదమ్ములిద్దరూ రాజీనామా చేస్తాననడం మాత్రం విశేషం.

Tags:    
Advertisement

Similar News