తిరుపతిపై చంద్రబాబు బెంగ..!

చంద్రగిరిలో టీడీపీకి వరుసగా పరాభవాలు ఎదురవుతుండగా, ప్రస్తుతం తిరుపతిలో కూడా అదే పరిస్థితి నెలకొనడం చంద్రబాబును కలవరపాటుకు గురిచేస్తోంది.

Advertisement
Update: 2022-07-28 07:41 GMT

ఒకప్పుడు టీడీపీకి మంచి పట్టున్న తిరుపతి నియోజకవర్గంలో పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుండటం చంద్రబాబును ఆందోళనకు గురి చేస్తోంది. చంద్రబాబు పుట్టి పెరిగింది తిరుపతి పక్కనే ఉన్న‌ చంద్రగిరి నియోజకవర్గం కాగా, ఆయన విద్యాభ్యాసం తిరుపతిలో సాగింది. అయితే ఆయనకు విచిత్రంగా సొంత నియోజకవర్గం చంద్రగిరిలో అంత పట్టు లేకపోవడంతో కుప్పానికి వలస వెళ్లి వరుసగా అక్కడి నుంచే గెలుస్తున్న సంగతి తెలిసిందే. చంద్రగిరిలో టీడీపీకి వరుసగా పరాభవాలు ఎదురవుతుండగా, ప్రస్తుతం తిరుపతిలో కూడా అదే పరిస్థితి నెలకొనడం చంద్రబాబును కలవరపాటుకు గురిచేస్తోంది.

సొంత ప్రాంతంలో పార్టీ బలహీనంగా ఉండటం బాబును ఇబ్బందికి గురిచేస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో తిరుపతిలో టీడీపీ తరఫున వెంకటరమణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన కొద్ది రోజులకే మృతి చెందడంతో ఉప ఎన్నికలో ఆయన భార్య సుగుణమ్మ విజయం సాధించారు. వెంకట రమణ మృతితో సానుభూతి వల్ల సుగుణమ్మకు భారీగానే ఓట్లు వచ్చాయి. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో సుగుణమ్మపై వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి విజయం సాధించారు. స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన భూమన ఆ తర్వాత నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

తిరుపతి శాసనసభ ఎన్నికల తర్వాత జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికలు, తిరుపతి టౌన్ బ్యాంకు సొసైటీ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలిచింది. ఈ మూడేళ్లలో తిరుపతిలో వైసీపీ బలంగా పుంజుకోగా టీడీపీ మాత్రం బలహీనపడింది. వెంకటరమణ మృతితో తిరుపతిలో పార్టీని ముందుకు నడిపించే నాయకుడు లేకుండా పోయాడు.

ఏ నియోజక‌వర్గంలో అయినా ప్రధాన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు విపరీతమైన పోటీ ఉంటుంది. నాయకుల కొరత ఉండదు. కానీ తిరుపతి టీడీపీలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. వెంకటరమణ మృతి చెందిన తర్వాత ఆయన భార్య సుగుణమ్మ టీడీపీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఆమెకు నియోజకవర్గంపై పెద్దగా పట్టు లేదు. ఆమె భర్తకున్న ఫాలోయింగ్ కారణంగానే ఎలాగోలా రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు దమ్మున్న నాయకుడు ఒక్కరు కూడా కనిపించకపోవడంతో అక్కడ టీడీపీ రాజకీయాలు అన్ని సుగుణమ్మ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి.

ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం మాత్రమే ఉండడంతో తిరుపతిలో టీడీపీని నిలబెట్టడమెలా? అనే విషయమై చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. వరుస పరాజయాలు, పార్టీ స్థితిగతుల గురించి తెలుసుకునేందుకు బుధవారం తిరుపతికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. టీడీపీ కార్పొరేటర్ మునికృష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు తిరుపతిలో పార్టీ పరిస్థితులపై చంద్రబాబుతో చర్చించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు తిరుపతి టీడీపీలో నెలకొన్న విభేదాలు, వరుస పరాజయాలు ఎదురవడానికి గల కారణాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున సుగుణమ్మ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా, మరో వర్గానికి చెందిన పార్టీ శ్రేణులు ఆమెకు వ్యతిరేకంగా పని చేశారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో టీడీపీని నిలబెట్టేదెలా అని చంద్రబాబు మదనపడుతున్నారు. దీనిపై వరుసగా ఆ నియోజకవర్గ నాయకులతో చంద్రబాబు చర్చిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News