బాబు బెయిల్‌ షరతుల ఉల్లంఘనలు.. పెన్‌డ్రైవ్‌లో హైకోర్టుకు

హైకోర్టు చంద్రబాబుకు పలు షరతులతో మంగళవారం తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసిందని.. బాబు వాటిని తొలిరోజు నుంచే ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో వాటికి అదనంగా మరిన్ని షరతులు విధించాలంటూ సీఐడీ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది.

Advertisement
Update: 2023-11-02 02:09 GMT

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో రిమాండ్‌లో ఉండి.. కంటి శస్త్ర చికిత్స కోసం మధ్యంతర బెయిల్‌ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తొలి రోజు నుంచే షరతులు ఉల్లంఘించడం మొదలుపెట్టారని సీఐడీ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు సీఐడీ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి న్యాయస్థానం ముందు బుధవారం తన వాదనలు వినిపించారు. అనారోగ్యం సాకుతో బయటకు వచ్చిన చంద్రబాబు ఆ వెంటనే రాజకీయ ర్యాలీ ప్రారంభించారని, జైలు బయటే మీడియాతో కూడా మాట్లాడారని ఆయన వివరించారు.

అదనపు షరతులు విధించాలంటూ..

హైకోర్టు చంద్రబాబుకు పలు షరతులతో మంగళవారం తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసిందని.. బాబు వాటిని తొలిరోజు నుంచే ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో వాటికి అదనంగా మరిన్ని షరతులు విధించాలంటూ సీఐడీ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. చంద్రబాబు మీడియాతో మాట్లాడటం, ర్యాలీల్లో పాల్గొనడం, కేసు గురించి మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేయడానికి వీల్లేదంటూ ఆదేశించింది. ఈ సందర్భంగా ఏఏజీ సుధాకర్‌రెడ్డి చంద్ర‌బాబు నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన పెన్‌ డ్రైవ్‌ను న్యాయమూర్తికి అందజేశారు. బాబు నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో అదనపు షరతులు విధించాలని న్యాయస్థానాన్ని కోరారు.

చంద్రబాబు కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులను ఆయన వెంట ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ అధికారులు చంద్రబాబు స్వేచ్ఛకు ఏ రకంగానూ భంగం కలగ నివ్వబోరని, ఇది తాము ఇస్తున్న హామీ అని నివేదించారు. మధ్యంతర బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌లో కోర్టు ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటామని చంద్రబాబు తెలిపారని ఈ సందర్భంగా సుధాకర్‌ రెడ్డి గుర్తుచేశారు.

3న నిర్ణయం వెలువరించనున్న న్యాయస్థానం

మరోపక్క చంద్రబాబు తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ బాబు నిబంధనలు ఉల్లంఘించలేదని చెప్పారు. ఆయన ర్యాలీలో పాల్గొనలేదని, ఆయనకు మద్దతు, సంఘీభావం తెలిపేందుకు ఆయన వద్దకే ప్రజలు వచ్చారని తెలిపారు. న్యాయస్థానం షరతులను ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దును కోరే స్వేచ్ఛ సీఐడీకి ఉందని, అందువల్ల సీఐడీ కోరుతున్న విధంగా షరతులు విధించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ మల్లికార్జునరావు అదనపు షరతుల విషయంలో ఈనెల 3వ తేదీ శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరిస్తానని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News