చంద్రబాబుకు తలనొప్పి తప్పదా?

నంద్యాలలోని భూమా కుటుంబానికి కావాల్సినవారితో జగద్విఖ్యాత రెడ్డి సమావేశమయ్యాడు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయేది తానే అని స్పష్టంగా ప్రకటించాడు.

Advertisement
Update: 2023-08-02 15:43 GMT

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు నంద్యాల నియోజకవర్గంలో తలనొప్పి తప్పేట్లు లేదు. ఎందుకంటే ఇంతకాలం మాజీ మంత్రి అఖిలప్రియ మాత్రమే చంద్రబాబు ఆదేశాలను ఖాతరు చేయ‌డం లేదు. ఇప్పుడు అక్కకి తమ్ముడు జగద్విఖ్యాత రెడ్డి కూడా తోడయ్యాడు. ఆళ్ళగడ్డ, నంద్యాల రెండు నియోజకవర్గాలు తమ సొంతమన్నట్లుగా మాట్లాడుతున్నారు. సోమవారం నంద్యాలలోని భూమా కుటుంబానికి కావాల్సినవారితో జగద్విఖ్యాత రెడ్డి సమావేశమయ్యాడు. రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయేది తానే అని స్పష్టంగా ప్రకటించాడు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఈ మధ్యనే నంద్యాల నియోజకవర్గంలోని పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, సీనియర్ నేతలు ఏవీ సుబ్బారెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ తదితరులతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయేది బ్రహ్మానందరెడ్డే అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారట. అందుకనే బ్రహ్మానందరెడ్డి హుషారుగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అఖిలను నంద్యాల నియోజకవర్గంలో ఎవరు ఎంటర్‌టైన్ చేయొద్ద‌ని చెప్పారట. ఇది తెలిసిన వెంటనే మద్దతుదారులతో జగద్విఖ్యాత సమావేశం పెట్టారు.

తన‌ను నంద్యాలలో తిరగొద్ద‌ని చెప్పే అధికారం ఎవరికీ లేదని, ఎవరైనా చెప్పినా వినిపించుకునేదిలేదని తేల్చిచెప్పాడట. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా పోటీ చేసేది మాత్రమే తానే అని అన్నాడట. నంద్యాల నియోజకవర్గంలో తన తండ్రి భూమా నాగిరెడ్డి రాజకీయాన్ని తాను కంటిన్యూ చేస్తానని చెప్పాడట. నాగిరెడ్డి వారసత్వం తనకే కానీ ఇంకోరికి ఎలాగ వస్తుందని మద్దతుదారులను అడిగాడట. తన తండ్రి ఎక్కడైతే ప్రాణాలు వదిలారో అక్కడి నుండే తన రాజకీయం మొదలవుతుందన్నాడట.

జరుగుతున్నది చూస్తుంటే అక్కా, తమ్ముళ్ళు నంద్యాల, ఆళ్ళగడ్డలో టీడీపీని బాగా కంపు చేసేట్లుగానే కనిపిస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల‌పై చంద్రబాబు ఒకటి చెబుతుంటే అక్కా, తమ్ముళ్ళు మరోరకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలను ఏ మాత్రం లెక్కచేయటంలేదు. ఆళ్ళగడ్డలో అఖిలకు టికెట్ దక్కే అవకాశం లేదని ఒకవేళ పోటీ చేసినా ఓడిపోవటం ఖాయమని పార్టీలోనే సీనియర్లు బాహాటంగానే చెప్పేస్తున్నారు. అందుకనే అఖిల ఆళ్ళగడ్డను వదిలేసి నంద్యాలలో తిరుగుతున్నారు. తాజాగా తమ్ముడు జగద్విఖ్యాత కూడా రంగంలోకి దిగబోతున్నట్లు సంకేతాలిచ్చారు. కొద్దిరోజుల్లో భూమా మౌనిక రంగంలోకి దిగబోతున్నారు. మొత్తానికి భూమా ఫ్యామిలీ దెబ్బకు చంద్రబాబుకు తలనొప్పులు తప్పదని అర్థ‌మైపోతోంది.

Tags:    
Advertisement

Similar News