అసలు సైకోలు ఎవరు?

వీళ్లు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, ఎంతగా తిడుతున్నా జగన్ మాత్రం ఒక్కమాట కూడా పరుషంగా వాళ్ల‌ గురించి మాట్లాడటంలేదు. దాంతో అసలు సైకోలు ఎవరు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Advertisement
Update: 2023-08-25 06:31 GMT

రాష్ట్ర రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితులు కనబడుతున్నాయి. వైసీపీ మినహా మిగిలిన అన్నీ పార్టీలు ప్రతిపక్షాలే. అయితే జగన్మోహన్ రెడ్డి మీద దండెత్తటంలో మాత్రం ప్రతిపక్షాల్లోని నేతలు చాలామంది ఏకమవుతున్నారు. వీరిలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ అయితే జగన్‌ను పదేపదే సైకో అని మండిపోతుంటారు. పార్టీ సమావేశాలు, మీడియా సమావేశాలే కాకుండా చివరకు బహిరంగసభల్లో కూడా జగన్‌ను వీళ్ళముగ్గురు సైకో అనే సంభోదిస్తుంటారు.

వీళ్ళ ఆరోపణలను పక్కన పెడితే జనాలకు అసలు సైకో ఎవరు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ముందుగా చంద్రబాబు వ్యవహారం తీసుకుంటే తాను అధికారంలోకి రాగానే వైసీపీ ఎమ్మెల్యేలను, నేతలందరినీ జైళ్ళల్లో పెట్టిస్తానని ఒక వంద సార్లయినా హెచ్చరించి ఉంటారు. అందరి పాపాలను నోట్ చేసుకుంటున్నానని, ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టేది లేదన్నారు. వైసీపీకి సహకరిస్తున్న అధికారులు ముఖ్యంగా పోలీసు అధికారులపైన కూడా యాక్షన్ తీసుకుంటానని బెదిరిస్తున్నారు. మొన్నటి పుంగనూరు పర్యటనలో ఎంత గొడవైందో అందరు చూసిందే. పోలీసులు, వైసీపీ శ్రేణులను కొట్టండి, చంపండి అంటు మైకులో చంద్రబాబు అరచిన విషయం అందరూ విన్నదే.

పవన్ కల్యాణ్ విషయం చూస్తే వైసీపీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడారు. బట్టలూడదీస్తానన్నారు. మోకాళ్ళపై కూర్చోబెడతానని చెప్పారు. పరుగులు పెట్టించి కొడతానని బెదిరించారు. మధ్యమధ్యలో తనకు ఓట్లేయని జనాలను శాపనార్థాలు పెడుతున్నారు. జగన్‌ను తిట్టడం, జనాలకు శాపనార్థాలు పెట్టడమే టార్గెట్‌గా వారాహియాత్ర చేస్తున్నారు.

ఇక లోకేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. యువగళం పాదయాత్రలో జగన్‌ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మొన్నటి గన్నవరం నియోజకవర్గం పర్యటనలో కానీ బహిరంగసభలో కానీ కొడాలి నాని, వల్లభనేని వంశీని నోటికొచ్చినట్లు తిట్టారు. అధికారంలోకి రాగానే ఇద్దరినీ చంపేస్తానన్నారు. బట్టలూడదీసి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. మోకాళ్ళ మీద నిలబెడతానని వార్నింగులిచ్చారు. రెడ్ డైరీలో అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నట్లు పదేపదే బెదిరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి కథ‌ చూస్తానని బెదిరిస్తున్నారు. వీళ్ళ ముగ్గురు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, ఎంతగా తిడుతున్నా జగన్ మాత్రం ఒక్కమాట కూడా పరుషంగా వీళ్ళ గురించి మాట్లాడటంలేదు. దాంతో అసలు సైకోలు ఎవరు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.


Tags:    
Advertisement

Similar News