ఏమిటా రహస్యం ?- ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ప్రభుత్వం 9.88 ఎకరాల్లో మాత్రమే పనులు చేస్తోందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అందుకు ప్రధాన న్యాయమూర్తి.. గూగుల్‌ మ్యాపులు కూడా అబద్దం చెబుతాయా అని ప్రశ్నించారు.

Advertisement
Update: 2022-10-13 10:21 GMT

విశాఖ రుషికొండ వద్ద ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలపై ఏపీ హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. కొండను తవ్వడంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. ప్రభుత్వం ఏదో దాస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. రుషికొండ వద్ద 9.88 ఎకరాల్లో పనులకు అనుమతులు ఉంటే.. ఏకంగా 20 ఎకరాలను తవ్వేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.

అందుకు సంబంధించిన గూగుల్‌ మ్యాప్‌లను చూపించారు. లేదు ప్రభుత్వం 9.88 ఎకరాల్లో మాత్రమే పనులు చేస్తోందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అందుకు ప్రధాన న్యాయమూర్తి.. గూగుల్‌ మ్యాపులు కూడా అబద్దం చెబుతాయా అని ప్రశ్నించారు. రుషికొండ వద్ద ప్రభుత్వం ఏదో రహస్యాన్ని దాస్తోందనిపిస్తోందని సీజే వ్యాఖ్యానించారు.

అభివృద్ది పేరిట కొండలను ఇలా తవ్వేస్తే ఎలా అని కోర్టు ప్రశ్నించింది. కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేయాలని కమిటీ వేస్తే ఎందుకు ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోందని నిలదీసింది. దాంతో పూర్తి వివరాలు చెప్పేందుకు తమకు కొద్దిగా సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. కేసు విచారణను నవంబర్ 3కు హైకోర్టు వాయిదా వేసింది.

జీవోలను వెనక్కు తీసుకున్న ప్రభుత్వం

అటు ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేస్తూ జారీ చేసిన జీవోల విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇది వరకే కేసుల ఉపసంహరణపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో జీవోలను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఈ విషయాన్నే కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దాంతో ప్రజాప్రయోజన వ్యాజ్యానికి హైకోర్టు ముగింపు పలికింది.

Tags:    
Advertisement

Similar News