భజరంగ్ దళ్, వీహెచ్ పీలకు హైదరాబాద్ సీపీ వార్నింగ్

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బక్రీద్ సందర్భంగా పశువులను తీసుకెళ్తున్న వాహనాలను వెంబడించడం, వ్యక్తులపై దాడులకు దిగడం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ హిందూ సంస్థలతో సీవీ ఆనంద్ సమావేశమయ్యారు. లవ్ ఫర్ కౌ, తెలంగాణ గోశాల, కౌ జ్ఞాన్ ఫౌండేషన్, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ తదితర సంస్థల ప్రతినిధులు, సీనియర్ […]

Advertisement
Update: 2022-07-07 02:17 GMT

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బక్రీద్ సందర్భంగా పశువులను తీసుకెళ్తున్న వాహనాలను వెంబడించడం, వ్యక్తులపై దాడులకు దిగడం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన అన్నారు.

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ హిందూ సంస్థలతో సీవీ ఆనంద్ సమావేశమయ్యారు. లవ్ ఫర్ కౌ, తెలంగాణ గోశాల, కౌ జ్ఞాన్ ఫౌండేషన్, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ తదితర సంస్థల ప్రతినిధులు, సీనియర్ పోలీసు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

పశువులను తీసుకెళ్ళే వాహనాలను ఆపడం, చెక్‌పోస్టుల వద్ద జోక్యం చేసుకోవడం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. “చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరినీ అనుమతించబోము. మత సమూహాల మధ్య ఏదైనా గొడవలు మొదలైతే అవి మత సామరస్యాన్ని దెబ్బతీస్తాయి” అని పోలీసు కమిషనర్ అన్నారు.

జులై 10న బక్రీద్‌తో పాటు ఇతర ప్రముఖ ఉత్సవాలు జరగనున్నందున నగర పోలీసులు అధిక నిఘాను ఏర్పాటు చేశారు. మతపరమైన నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు నగర పోలీసులు తీసుకుంటున్న పటిష్టమైన చర్యలను కమిషనర్ సభకు హాజరైన వారికి వివరించారు. కార్యకర్తలు ఎలాంటి సమాచారాన్నైనా అధికారులకు అందజేయాలని, తాము త్వరితగతిన స్పందిస్తామని హామీ ఇచ్చారు.

అక్రమ రవాణా, అక్రమ జంతువధను నియంత్రించడంలో వివిధ సంస్థల ప్రత్యేక పాత్రపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జంతు సంరక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని జంతు సంరక్షణ కార్యకర్తలు సూచించారు.

తెలంగాణలో గతంలోనూ గోరక్షణకు సంబంధించిన అనేక ఉదంతాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ సమీపంలో గోరక్షకులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు పశువులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోవడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న వారిని తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అంజనీకుమార్ అప్పుడే హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News