గజ్వేల్ దాకా ఎందుకు..? దమ్ముంటే హుజూరాబాద్ లో మళ్లీ గెలువు..

హుజూరాబాద్ కి ఒక్క మంచి పని కూడా చేయలేని ఈటల, గజ్వేల్ పోటీపై సవాళ్లు విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Advertisement
Update: 2022-07-28 02:58 GMT

గజ్వేల్ దాకా ఎందుకు.. దమ్ముంటే ఇంకోసారి హుజూరాబాద్ లోనే గెలిచి చూపించు అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు. బీజేపీలో చేరిన తర్వాత ఈటల గొప్పలకు పోతున్నారని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత హుజూరాబాద్‌ నియోజకవర్గంలో జరిగిన ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు కౌశిక్ రెడ్డి. హుజూరాబాద్‌ ప్రజలు ఉప ఎన్నికలో గెలిపిస్తే వారి సమస్యలను పట్టించుకోకుండా ఈటల పారిపోతున్నారని అన్నారు. ఒక్క రోజు కూడా స్థానికంగా లేరని, అభివృద్ధిపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో పారిపోతున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ కి ఒక్క మంచి పని కూడా చేయలేని ఈటల, గజ్వేల్ పోటీపై సవాళ్లు విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

హుజూరాబాద్ లో ఓటమి భయమా..?

మరోసారి హుజూరాబాద్‌ లో పోటీ చేస్తే ఓడిపోతాననే భయంతోనే గజ్వేల్‌ లో పోటీ చేస్తానంటూ ఈటల బీరాలు పలుకుతున్నారని అన్నారు కౌశిక్ రెడ్డి. పేరు, పత్రం లేని ఈటల రాజేందర్‌ ను లీడర్‌ చేసిన కేసీఆర్‌ నే మోసం చేశాడ‌ని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ లో ఉన్నవారంతా కేసీఆర్‌ బానిసలని అంటున్న ఈటల.. 2004 నుంచి 2021 వరకు ఏ బానిసత్వం చేస్తూ టీఆర్‌ఎస్‌ లో ఉన్నారని ప్రశ్నించారు. దళితుల భూములను కబ్జా చేసిన చరిత్ర ఈటల రాజేంద‌ర్‌దని, ఆయన బీసీ ముసుగులో ఉన్న దొర అని విమర్శించారు. ఐదెకరాల స్థలంలో గడీ కట్టుకొని పాలిస్తుంది ఈటలేనని అన్నారు కౌశిక్ రెడ్డి.

ఇటీవల వరుసగా కేసీఆర్ ని టార్గెట్ చేసుకుని ఈటల సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. గజ్వేల్ లో పోటీచేస్తా, కేసీఆర్ ని ఓడిస్తా, బీజేపీ పరువు నిలుపుతానంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఇప్పటికే వీటిపై చాలామంది టీఆర్ఎస్ నేతలు స్పందించినా.. కౌశిక్ రెడ్డి మాత్రం కాస్త ఘాటుగానే తగులుకున్నారు. హుజూరాబాద్ కి ఏమీ చేయలేని పెద్ద మనిషి, గజ్వేల్ వెళ్లి ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. దమ్ముంటే మరోసారి హుజూరాబాద్ లోనే పోటీ చేసి గెలవాలన్నారు.

Tags:    
Advertisement

Similar News