శరవేగంగా కొత్త సెక్రటేరియట్ ముస్తాబు.. మూడు షిఫ్టుల్లో పనులు

సీఎం కోసం ఆరవ అంతస్తులో అత్యంత ఆధునిక హంగులతో చాంబర్ నిర్మించారు. ఇక్కడకు చేరుకోవడానికి ప్రత్యేక ద్వారంతో పాటు, లిఫ్టులు కూడా ఏర్పాటు చేశారు.

Advertisement
Update: 2023-01-30 12:28 GMT

తెలంగాణ కొత్త సచివాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతోంది. సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి మరో మూడు వారాలే సమయం ఉండటంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. కీలకమైన నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. కేవలం సుందరీకరణ పనులు మాత్రమే మిగిలాయి. అయినా సరే మూడు షిఫ్టుల్లో పనులు జరిపిస్తూ శర వేగంగా నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. హూస్సేన్‌సాగర్ తీరంలో పాత సచివాలయం స్థానంలో నిర్మించిన ఈ కొత్త సెక్రటేరియట్‌కు డాక్టర్ బీఆర్ అంబేత్కర్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున (ఫిబ్రవరి 17) ఈ కొత్త భవనం అందుబాటులోకి రానున్నది.

సీఎం కేసీఆర్ 2019 జూన్ 27న కొత్త సచివాలయానికి భూమి పూజ చేశారు. కేవలం నాలుగేళ్ల లోపే ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇందుకు దాదాపు రూ.610 కోట్లు ఖర్చు అయ్యింది. హైదరాబాద్ వారసత్వ సంపదకు చిహ్నంగా ఈ నిర్మాణ శైలి ఉంది. నిజాం కట్టడాలను పోలిన డిజైన్‌తో రూపొందించిన ఈ సచివాలయం ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాత్రి పూత విద్యుత్ దీపాల వెలుగులో అత్యద్భుతంగా ఈ బిల్డింగ్ కనపడుతున్నది. అలనాటి వైభవానికి ఏ మాత్రం తీసిపోకుండా నిర్మించిన ఈ భవనం 278 అడుగుల ఎత్తు ఉన్నది. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మొత్తం 7 అంతస్తులు ఉన్నాయి. రూఫ్ టాప్‌లో స్కై లాంజ్ ఏర్పాటు చేశారు. ఇది సెక్రటేరియట్‌కే ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.

సచివాలయం ఎదుట ఆహ్లాదకరమైన పార్కులతో పాటు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కోసం ఆరవ అంతస్తులో అత్యంత ఆధునిక హంగులతో చాంబర్ నిర్మించారు. ఇక్కడకు చేరుకోవడానికి ప్రత్యేక ద్వారంతో పాటు, లిఫ్టులు కూడా ఏర్పాటు చేశారు. భవనంపై మొత్తం 34 గుమ్మటాలు ఉన్నాయి. అలాగే ప్రధాన గుమ్మటాలపై జాతీయ చిహ్నమైన నాలుగు సింహాల గుర్తును ఏర్పాటు చేశారు. కొత్త సెక్రటేరియట్‌ను జనవరి 18నే ప్రారంభించాలని తొలుత భావించారు. అయితే కొన్ని పనులు మిగిలి పోవడంతో ఫిబ్రవరి 17కు తేదీని మార్చారు. అప్పటి లోగా నిర్మాణం పూర్తి చేయాలని ఇప్పటికే కాంట్రాక్టర్‌కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    
Advertisement

Similar News