గీతన్నలకు త్వరలో మోపెడ్ లు.. గౌడ సమ్మేళనంలో కేటీఆర్ వరాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కులవృత్తులకు అన్యాయం జరిగిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ధ్వంసమైన కులవృత్తులను నిలబెడుతున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. గీతకార్మికుల తలరాత మార్చామని అన్నారు.

Advertisement
Update: 2022-10-24 05:19 GMT

కల్లు గీత కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉందని, భవిష్యత్తులో వారి సంక్షేమం కోసం మరింత కృషి చేస్తుందని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన, గీతన్నలకు వరాలు ప్రకటించారు. సీఎం కేసీఆర్ మనసుతోపాటు, ఆయన ఆలోచన కూడా చాలా పెద్దదని, అందుకే దళిత బంధు వంటి పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. యాదవులకు గొర్రెలు, ముదిరాజ్‌ లకు చేప పిల్లలు, మోపెడ్‌ లు, వలలు ఇస్తున్నామని, పద్మశాలీలకు నూలుపై సబ్సిడీ, పొదుపు పథకంలో వాటా ఇస్తున్నామని, గౌడన్నలకు కూడా ఇదే తరహాలో సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 70 వేల మంది గీత కార్మికులకు ప్రతి నెలా 2వేలు పింఛన్ ఇస్తున్నామని, త్వరలో వారందరికీ మోపెడ్ లు ఇస్తామని చెప్పారు.

కులవృత్తులను ఆదరించే ప్రభుత్వం..

దేశంలో కులవృత్తులను ఆదరించే ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు కేటీఆర్. పొరుగు రాష్ట్రం కర్నాటకలో అధికార బీజేపీ కల్లుగీతపై నిషేధం విధించి, గౌడన్నల కడుపు కొట్టిందని చెప్పారు. రాష్ట్రంలోని 2,29,852 మంది గీత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తోందని చెప్పారు. 50ఏళ్లు దాటిన గీత కార్మికులకు 2116 రూపాయల పింఛన్ ఇస్తున్నామని అన్నారు. గీత కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే తక్షణం 5లక్షల రూపాయల బీమా ఇస్తున్నామని చెప్పారు. గౌడన్నలకు వైన్‌ షాపుల్లో 15 శాతం రిజర్వేషన్‌ ఇచ్చామని, ఇలాంటి వెసులుబాటు ఒక్క తెలంగాణలోనే ఉందని తెలిపారు మంత్రి కేటీఆర్.

హరితహారం..

హరితహారం కార్యక్రమంలో 5 కోట్ల తాటి, ఈత చెట్లతో వనాలు పెంచుతున్నామని చెప్పారు కేటీఆర్. కొత్తగా నీరా పాలసీ తీసుకొచ్చామని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కులవృత్తులకు అన్యాయం జరిగిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ధ్వంసమైన కులవృత్తులను నిలబెడుతున్నామని చెప్పారు కేటీఆర్. గీతకార్మికుల తలరాత మార్చామని అన్నారు. గీత కార్మికులు టీఆర్ఎస్ కి అండగా నిలబడాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News