దమ్ము చూపుతాం, దుమ్మురేపుతాం.. పాన్ ఇండియా స్థాయి మనది..

జాతీయ పార్టీ ఏర్పాటు తరువాత తొలిసభను కరీంనగర్‌ లో నిర్వహించేలా తీర్మానం చేస్తున్నామని, తమ ఆశ నెరవేర్చాలని మంత్రి గంగుల కమలాకర్ కేటీఆర్‌ కు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Update: 2022-10-03 02:39 GMT

తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాయని, దేశవ్యాప్తంగా దుమ్మురేపుతున్నాయని, ఆ స్థాయిలో త్వరలో తెలుగు పార్టీ కూడా భారత దేశంలో దుమ్మురేపేందుకు సిద్ధమవుతోందని అన్నారు మంత్రి కేటీఆర్. తెలుగునాట తెరకెక్కిన పాన్ ఇండియా సినిమాలు ఎలా సక్సెస్ అయ్యాయో, తెలుగు పార్టీ కూడా పాన్ ఇండియా లెవల్లో విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. కరీంనగర్ కళోత్సవాల ముగింపు సభలో పాల్గొన్న ఆయన, పాన్ ఇండియా సినిమాల పేరు చెప్పి కార్యకర్తల్ని ఉర్రూతలూగించారు. జాతీయ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయంపై హింట్ ఇచ్చి ఆసక్తి రేకెత్తించారు.

తొలిసభ కరీంనగర్ లోనే..!

తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్‌ కీలక పాత్ర పోషించిందన్నారు కేటీఆర్. ఇదే కరీంనగర్‌ వేదికగా నాటి సింహగర్జన సభతో, ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న తాజా సంచలన నిర్ణయం దుమ్మురేపుతుందని, ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. జాతీయ పార్టీ ఏర్పాటు తరువాత తొలిసభను కరీంనగర్‌ లో నిర్వహించేలా తీర్మానం చేస్తున్నామని, తమ ఆశ నెరవేర్చాలని మంత్రి గంగుల కమలాకర్ కేటీఆర్‌ కు విజ్ఞప్తి చేశారు.

కళాకారులకు అండగా..

కరీంనగర్ కళోత్సవాల్లో పాల్గొన్న కేటీఆర్ దాదాపు మూడున్నర గంటలపాటు ప్రదర్శనల్ని తిలకించారు. కళాకారుల్ని సన్మానించారు. ఉద్యమంలో కేసీఆర్‌ మాట ఎంత పవర్‌ ఫుల్ గా నిలబడిందో, కళాకారుల పాట కూడా అంతే బలంగా నిలబడిందని చెప్పారు కేటీఆర్. ఒక్కప్పుడు తెలంగాణ భాష అంటే పట్టించుకోని పరిస్థితులున్నాయని, ఇప్పుడు తెలంగాణ యాస లేకుంటే సినిమాలు హిట్టు కాలేని పరిస్థితులొచ్చాని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 574 మంది కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని గుర్తు చేశారు. అజ్ఞాతసూర్యులుగా ఇంకా వేలమంది కళాకారులు ఉన్నారని, వారికి గౌరవమిచ్చేలా కళోత్సవాల నిర్వహిస్తామని చెప్పారు. కరీంనగర్ తో పాటు, ఇకపై అన్ని జిల్లాల్లో, రాజధానిలో కూడా ఇలాంటి వేదికలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News