వైసీపీ, బీఆర్ఎస్ కేంద్రంలో చక్రం తిప్పొచ్చు -కేటీఆర్

ఎన్‌డీఏ, ఇండియా కూటమిలో లేని బీఆర్‌ఎస్‌, బిజు జనతాదళ్‌, వైఎస్ఆర్‌సీపీ వంటి మొత్తం 13 పార్టీలు ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు, దేశ రాజధానిని శాసించొచ్చని చెప్పారు కేటీఆర్.

Advertisement
Update: 2024-05-05 09:58 GMT

కేంద్రంలో బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవని అనుకోవద్దని, మనకి కాలం కలిసొస్తే థర్డ్ ఫ్రంట్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి రావొచ్చని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. "రేపు కాలం కలిసొస్తే ఏదైనా జరగొచ్చు. ఎన్‌డీఏ, ఇండియా కూటమిలో లేని బీఆర్‌ఎస్‌, బిజు జనతాదళ్‌, వైఎస్ఆర్‌సీపీ వంటి మొత్తం 13 పార్టీలు ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు, దేశ రాజధానిని శాసించొచ్చు. శాసించి ఢిల్లీని లొంగదీసుకుందామా..? యాచించి వాళ్ల వద్దకు పోదామా ఆలోచించాలి." అని అన్నారు కేటీఆర్.

మనకు బీజేపీతో కలసి వెళ్లాల్సిన ఖర్మ ఇప్పటి వరకు రాలేదని, రేపు కూడా ఉండదని అన్నారు కేటీఆర్. తెలంగాణలో 10నుంచి 12 లోక్ సభ స్థానాలు గెలిచినా కూడా తాము సెక్యులర్‌ పార్టీగానే ఉంటామన్నారాయన. మతతత్వ పార్టీలతో కలవబోమని స్పష్టం చేశారు.

బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని, రాహుల్‌గాంధీ స్వయంగా ఉత్తరప్రదేశ్‌ను వదిలి కేరళకు వెళ్లిన పరిస్థితి ఉందన్నారు కేటీఆర్. మనందరికీ అన్నం పెట్టిన అమ్మలాంటి హైదరాబాద్‌ విశ్వనగరం కావాలనుకుంటే బీఆర్‌ఎస్‏కు ఓటేయాలని పిలుపునిచ్చారు. మతం పేరిట పంచాయతీలు, కర్ఫ్యూలు, అల్లకల్లోలమైన విషనగరం కావాలనుకుంటే ఇక మీ ఇష్టం అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఉద్దేశపూర్వకంగా ముస్లింలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.

పిచ్చోడి చేతిలో రాయి..

తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు కేటీఆర్. బూతులు మాట్లాడడం, కేసీఆర్‌ను తిట్టడం పాలన కాదని చెప్పారు. ఐదు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కొత్త పరిశ్రమ కూడా తేలేదని, మనం కష్టపడి తెచ్చిన పరిశ్రమలని కూడా ఇక్కడి నుంచి వెళ్లగొట్టారని విమర్శించారు. ఐదు గ్యారంటీలు అమలు చేశామంటూ, సిగ్గు లేకుండా రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నిండా హోర్డింగ్‌లు పెట్టుకున్నారని అన్నారు. 10 నుంచి 12 స్థానాల్లో కేసీఆర్ ని గెలిపిస్తే.. 6నెలల నుంచి ఏడాదిలోపు కేసీఆర్‌ తిరిగి మీకు సేవ చేస్తారని, అలాంటి పరిస్థితులు వస్తాయని అన్నారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC