డిఫెన్స్ ఏరియాలో రోడ్ల అభివృద్దికి కేంద్రం అడ్డు తగులుతోంది కేటీఆర్

‘‘పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మాణానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ, ఢిల్లీలో పలుమార్లు ప్రయత్నించినా, దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి ముందుకు రావడం లేదు. ఇది బాధాకరమైనది,అవమానకరమైనది," అని కేటీఆర్ అన్నారు.

Advertisement
Update: 2023-02-10 02:15 GMT

హైదరాబాద్ లోని డిఫెన్స్ పరిధిలో ఉన్న రోడ్లను అభివృద్ది చేయడానికి కేంద్రం అడ్డు తగులుతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ, సికింద్రాబాద్‌లోని డిఫెన్స్ భూములలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP) కింద పనులను చేపట్టడంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నదని మండిపడ్డారు. సికింద్రాబాద్‌ నుంచి బోవెన్‌పల్లి వరకు ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించాలని శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ డిఫెన్స్ భూముల్లో SRDP పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేదని ఆరోపించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లై ఓవర్ల నిర్మాణానికి, రక్షణ భూముల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేళ్లుగా కేంద్రానికి లేఖలు రాస్తున్నప్పటికీ కేంద్రం సహకరించడం లేదని కేటీఆర్ చెప్పారు.

‘‘పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మాణానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ, ఢిల్లీలో పలుమార్లు ప్రయత్నించినా, దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి ముందుకు రావడం లేదు. ఇది బాధాకరమైనది,అవమానకరమైనది," అని కేటీఆర్ అన్నారు.

''అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్, సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్, ఇప్పుడు అధికారంలో ఉన్న రాజ్‌నాథ్ సింగ్ సహా గత ఎనిమిదేళ్లుగా వచ్చిన రక్షణ మంత్రులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని లేవనెత్తినప్పటికీ, వారు సహాయం చేయడానికి, భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు.'' అని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే న్యాయపరంగా పోరాటం చేయవచ్చని, కానీ, సైన్యం మీద గౌరవంతో తాము అలా చేయడం లేదని కేటీఆర్ అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP) కింద 48 పనులు చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు.

48 పనుల్లోను జీహెచ్‌ఎంసీ 42 పనులు, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఒక పని, రోడ్లు, భవనాల శాఖ 5 పనులు చేపట్టాయని తెలిపారు. 34 పనులు పూర్తయ్యాయని, 14 పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News