మంత్రి పదవినే వదిలేశా.. పార్టీ పదవి ఓ లెక్కా..?

ఇటీవల ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ కమిటీల్లో తన పేరు లేకపోవడంపై కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మంత్రి పదవినే వదిలేసినోడికి పార్టీ పదవి ఓ లెక్కా అని ఆయన ప్రశ్నించారు.

Advertisement
Update: 2022-12-11 10:23 GMT

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ సీటుని తనకి తానే కన్ఫామ్ చేసుకున్నారు. వచ్చే ఏడాది జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు వెంకట్ రెడ్డి, అయితే ఏ పార్టీనుంచి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నా, హస్తం గుర్తుపైనే పోటీ చేస్తానని చెప్పలేదు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

పార్టీ పదవి ఉంటే ఎంత, లేకపోతే ఎంత..?

ఇటీవల ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ కమిటీల్లో తన పేరు లేకపోవడంపై కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మంత్రి పదవినే వదిలేసినోడికి పార్టీ పదవి ఓ లెక్కా అని ఆయన ప్రశ్నించారు. పదవులు తనకు ముఖ్యం కాదని, పేదలు, కార్యకర్తలే తనకు ముఖ్యమని చెప్పారు. ఎంబీబీఎస్ చదువుతున్న పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసిన ఆయన, నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ప్రయాణంపై అస్పష్టంగా మాట్లాడారు. ఎన్నికలకు నెల ముందు వరకు తాను రాజకీయాలు మాట్లాడనన్నారు.

రాజగోపాల్ రెడ్డి బాటలోనే వెళ్తారా..?

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి వెంకట్ రెడ్డికి గ్యాప్ బాగా పెరిగింది. గతంలో ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినప్పుడే వెంకట్ రెడ్డిపై కూడా అందరికీ అనుమానం ఉన్నా ఆయన సైలెంట్ గా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా సైలెంట్ గా తనపని కానిచ్చేశారు. రాజగోపాల్ రెడ్డికి పరోక్ష సాయం అందించారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బాటలోనే వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతానికి పరిస్థితులన్నీ సానుకూలంగానే ఉన్నా.. వెంకట్ రెడ్డి మాత్రం వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. నేరుగా నోరు తెరిచి చెప్పలేదు కానీ, ఆయన కాషాయ కండువాకి బాగా దగ్గరయ్యారనే తెలుస్తోంది. అటు కాంగ్రెస్ కూడా వెంకట్ రెడ్డి ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇక మిగిలింది కండువా మార్చుకునే లాంఛనమే.

Tags:    
Advertisement

Similar News