బీజేపీ వాళ్లు ఉత్సవాలు అందుకే చేస్తున్నారా? కిషన్ రెడ్డిని ప్రశ్నించిన మంత్రి హరీశ్ రావు

ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ సిఫారసులు చేసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు.

Advertisement
Update: 2023-05-28 15:35 GMT

ఉద్యమ సమయంలో రాజీనామా చేయమంటే బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భయపడ్డాడు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదు. కనీసం ఒక్క ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి కేటాయించలేదు. కానీ, ఇప్పుడు ఉత్సవాలు చేస్తామని చెబుతున్నారు. తెలంగాణకు ఏమీ చేయలేదని ఉత్సవాలు చేస్తారా? అంటూ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఉత్సవాలు జరిపే నైతికత బీజేపీకి ఉందా అని మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ సిఫారసులు చేసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చమని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఎన్నో సార్లు లేఖలు రాసినా స్పందించలేదన్నారు. రాష్ట్రానికి రూ.1,350 కోట్ల బకాయిలు రావల్సి ఉన్నా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. వారికి నచ్చిన రాష్ట్రాలకు మాత్రం ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్ర అవతరణ ఉత్సవాలను వ్యతిరేకించడం అంటే అమరులను అవమానించడమే అని హరీశ్ రావు అన్నారు. ప్రధాని మోడీలో ఫెడరల్ స్పూర్తి దెబ్బతిన్నదని.. మిషన్ భగీరథకు రూ.20 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా.. పైసా ఇవ్వలేదని అన్నారు. గతంలో ఎన్నో సార్లు సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరయ్యారని.. ఒక్కసారి గైర్హాజరైనందుకే కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అని కిషన్ రెడ్డిని మంత్రి హరీశ్ నిలదీశారు.

రాష్ట్ర అప్పుల గురించి కాకుండా.. ముందు కేంద్రం చేసిన అప్పుల గురించి మాట్లాడాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిమితికి లోబడే అప్పులు చేసిందని.. కేంద్రం మాత్రం ఎప్పుడో పరిమితి దాటిపోయిందని అన్నారు. పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టమంటే ఎందుకు మొఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు.

దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని హరీశ్ రావు చెప్పారు. అమరుల త్యాగాలను, తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని హరీశ్ రావు అన్నారు. జూన్ 2 తెలంగాణకు స్వాతంత్ర దినంలాంటిదని చెప్పారు. అందరు  ఈ ఉత్సవాలను సంబురంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కామారెడ్డిలో త్వరలో మెడికల్ కాలేజీ ప్రారంభం..

కామారెడ్డిలో త్వరలో సూపర్ స్పెషాలిటీ సేవలతో మెడికల్ కాలేజీ ప్రారంభం కాబోతున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎల్లారెడ్డిలో నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి హరీశ్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఇప్పడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ సేవల వరకు అన్నీ అందుతున్నాయిన అన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News