జీహెచ్ఎంసీ హైఅలర్ట్.. అవసరమైతే ఈ నంబ‌ర్లకు కాల్ చేయండి

ఈరోజు అర్ధ‌రాత్రి నుంచి హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడేందుకు అవకాశం ఉండటంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది.

Advertisement
Update: 2022-07-28 15:56 GMT

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజులుగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలకు జంట జలాశయాల గేట్లు ఎత్తారు. దీంతో మూసీలోకి వరద పోటెత్తి పలు ప్రాంతాలు నీట‌మునిగాయి. చాదర్‌ఘాట్, మూసారాంబాగ్‌లోని లోలెవెల్ బ్రిడ్జీలపై నుంచి వరద పారడంతో వాటిని మూసేశారు. వరద తగ్గినా భారీగా రాళ్లు, చెత్త పేరుకోవడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది శుభ్రం చేశారు.

గురువారం సాయంత్రం కూడా హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీగా వర్షం పడింది. ఈరోజు అర్ధ‌రాత్రి నుంచి హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడేందుకు అవకాశం ఉండటంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు అత్యవసరంగా ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే 24 గంటలు జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

మూసీకి మరోసారి వరద భారీగా వరద రావడంతో పాటు నాలాలు కూడా పొంగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఏ ప్రాంతంలో అయినా భారీగా వరద వస్తే వెంటనే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని చెప్పింది. వరదల కోసమే ప్రత్యేకంగా 040-21111111, 040-29555500 నంబ‌ర్లను ఏర్పాటు చేశామని తెలిపింది. 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని, అత్యవసర సమయంలో వాటికి కాల్ చేయాలని సూచించింది.

శుక్రవారం వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కార్యాలయాలకు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించాలని, వ్యక్తిగత వాహనాలను వాడకపోవడం మంచిదని సూచించింది. అవసరం అయితే మెట్రో సర్వీసులు అదనంగా నడిపేందుకు సదరు అధికారులతో మాట్లాడుతున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News