నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ పండగ

ఈరోజు మొత్తం 19,020 యూనిట్లను మంత్రులు లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ నెల 5న మరో 17,864 ఇళ్లు పంపిణీ చేస్తారు.

Advertisement
Update: 2023-10-02 01:28 GMT

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ పండగ మరోసారి మొదలవుతోంది. ఈరోజు మొత్తం 19,020 యూనిట్లను మంత్రులు లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ నెల 5న మరో 17,864 ఇళ్లు పంపిణీ చేస్తారు. ఇప్పటికే రెండు విడతల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ సజావుగా పూర్తయింది. మూడో విడతలో మొత్తం 36,884 ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టారు. ఇప్పటికే ఎంపిక పూర్తి కాగా, ర్యాండమైజేషన్‌ విధానంలో ఫ్లాట్లను వారికి కేటాయిస్తారు. గ్రేటర్‌ లో కుత్బుల్లాపూర్‌, చేవెళ్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, పటాన్‌ చెరు, మేడ్చల్‌, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు అధికారులు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం పండగలా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో పంపిణీ పూర్తయింది. పైసా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా ఇళ్ల పట్టాలు తీసుకున్న లబ్ధిదారులు ఎంతో సంబర పడ్డారు. తమను ఓ ఇంటివారిని చేసిన సీఎం కేసీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. నగరంలో ఇప్పటి వరకు తొలి విడతలో 11,700 మందికి, రెండో విడతలో 13,200 మందికి ఇళ్లను పంపిణీ చేశారు.

మూడో విడతలో కూడా ఇళ్ల పంపిణీకి మంత్రులు హాజరవుతారు. మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్‌ ఆలీ, పట్నం మహేందర్‌ రెడ్డి, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆయా ప్రాంతాల్లో ఇళ్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారు. 

Tags:    
Advertisement

Similar News