బీఆర్ఎస్ పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకట్రెండు స్థానాల్లో బీఆర్ఎస్ కి డిపాజిట్ దక్కుతుందన్నారు కోమటిరెడ్డి.

Advertisement
Update: 2024-05-23 07:12 GMT

జూన్‌ 5 తర్వాత బీఆర్ఎస్ దుకాణం మూతపడుతుందంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతల్ని కార్యకర్తలు వెంటపడి కొడతారన్నారు. ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో ఉండరని, అందరూ బయటకు వచ్చేస్తారని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకట్రెండు స్థానాల్లో బీఆర్ఎస్ కి డిపాజిట్ దక్కుతుందన్నారు కోమటిరెడ్డి.

రాష్ట్ర సంపదను దోచుకుంది చాలక, ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ తో కోట్లు కొల్లగొట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని, చివరకు కవిత జైలుకి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వారు చేసిన అవినీతి, అక్రమాల వల్లే ఆ పార్టీ కూలిపోతోందని ఎద్దేవా చేశారు.

జిల్లాల్లో మున్సిపాల్టీల అనుమతులు లేకుండానే బీఆర్ఎస్ కార్యాలయాలు నిర్మించారని మండిపడ్డారు కోమటిరెడ్డి. అందెశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలని గత ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని, ఆడిటోరియానికి కాళోజీ పేరు పెట్టాల్నా వినిపించుకోలేదని, అందుకే తమ ప్రభుత్వంలో ఆయా పనుల్ని చేపట్టామని తెలిపారు. ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని వివరించారు కోమటిరెడ్డి.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెడితే, నియామక పత్రాలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి చంకలు గుద్దుకుంటున్నారని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నియామకాలు కూడా గత ప్రభుత్వమే ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారాయన. అధికారం చేపట్టగానే న్యాయపరమైన చిక్కులు తొలగించి ఉద్యోగాల భర్తీ చేపట్టామని వివరించారు కోమటిరెడ్డి. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ కట్టి అదే అభివృద్ధి అనుకోమంటే ఎలా అన్నారు. తెలంగాణకు పరిశ్రమలు తెచ్చిందే కాంగ్రెస్ అని చెప్పారు. కాళేశ్వరంకు రిపేర్లు చేసినా కూడా మూడు డ్యామ్ లు ఉంటాయనే నమ్మకం లేదని రిపోర్ట్ వచ్చిందన్నారు కోమటిరెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్ లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

Tags:    
Advertisement

Similar News