కాంగ్రెస్‌కు ప్రమాదకరమైన రోగం సోకింది - దామోదర రాజనరసింహ

కోవర్టులు మాత్రమే పదవులు దక్కిందన్నారు. ఈ కోవర్ట్ కల్చర్‌ను అరికట్టండి అని పదే పదే చెబుతున్నా చర్యలు లేవన్నారు. నిజమైన కాంగ్రెస్‌ కార్యకర్తలు అవమానాలకు గురవుతున్నారన్నారు.

Advertisement
Update: 2022-12-13 09:32 GMT

తెలంగాణ పీసీసీ కమిటీలో పదవుల వివాదం కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు ప్రమాదకరమైన రోగం సోకిందని మాజీ మంత్రి దామోదర రాజనరసింహ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ జబ్బు పేరే కోవర్టిజం అన్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ, కాంగ్రెస్‌ తమది అంటూనే లోలోన అధికార పార్టీకి సహకరించే శక్తులు కొన్ని తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్నాయన్నారు. కార్యకర్తలు లేకపోతే ఏ రాజకీయ పార్టీ కూడా నిలబడదని.. కార్యకర్తల ధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే పార్టీకే ప్రమాదమన్నారు.

మెదక్ జిల్లాలో కష్టపడి, డబ్బు ఖర్చు పెట్టి జోడో యాత్రను విజయవంతం చేసినవారికి కూడా గుర్తింపు ఇవ్వలేదన్నారు. కోవర్టులు మాత్రమే పదవులు దక్కిందన్నారు. ఈ కోవర్ట్ కల్చర్‌ను అరికట్టండి అని పదే పదే చెబుతున్నా చర్యలు లేవన్నారు. నిజమైన కాంగ్రెస్‌ కార్యకర్తలు అవమానాలకు గురవుతున్నారన్నారు.

పదవులు ఇచ్చిన తీరు చూస్తుంటే అందరూ కలిసి పార్టీని గెలిపించాలనుకుంటున్నారా లేక ఎవరి ఎజెండాతో వారు పనిచేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోందన్నారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాల గురించి తెలియనివారికి పదవులు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌కు అనుకూలమైన శక్తులు ఉన్నాయన్నారు. కోవర్ట్ వ్యవస్థలను గుర్తించి నివారించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ అధినాయకత్వంపైనే ఉందన్నారు. కోవర్టులకు సంబంధించిన ఆధారాలను కూడా పార్టీ నాయకత్వానికి సమర్పించామన్నారు. సమయం వచ్చినప్పుడు కోవర్టుల పేర్లు కూడా బయటకు చెబుతామన్నారు.

Advertisement

Similar News