జేఎన్​ యూలో ధర్నా చేస్తే రూ. 20 వేల జరిమానా... జేఎన్ యూ యాజమాన్య‍ం వివాదాస్పద నిర్ణయం

జేఎన్ యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమయ్యి 10 పేజీల 'విద్యార్థుల క్రమశిక్షణ, ప్రవర్తన నియమావళి’ని తయారు చేసింది. దాని ప్రకారం ఇకపై యూనివర్సిటీ క్యాంపస్ లో ధర్నా చేసినా, నిరసన తెలిపినా 20 వేల నుండి 30 వేల వరకు జరిమానా విధిస్తారు.

Advertisement
Update: 2023-03-02 06:58 GMT

దేశంలో ఎక్కడ సమస్యొచ్చినా ముందుగా స్పందించేది ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU). యూనివర్సిటీ సమస్యల గురించే కాక, దేశంలోని అన్ని సమస్యలపై ఉద్యమించేది JNU. మొదటి నుంచీ ఈ విశ్వవిద్యాలయం విద్యార్థుల చైతన్యం యాజమాన్యానికి కంటగింపుగానే ఉంది. ఈమధ్య ప్రధాని మోడీ పై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీని యూనివర్సిటీ క్యాంపస్ లో ప్రదర్శించే విషయంలో JNU లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో యాజ‌మాన్యం తాజాగా కఠినమైన నిబందనలను తీసుకొచ్చింది.

జేఎన్ యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమయ్యి 10 పేజీల 'విద్యార్థుల క్రమశిక్షణ, ప్రవర్తన నియమావళి’ని తయారు చేసింది. దాని ప్రకారం ఇకపై యూనివర్సిటీ క్యాంపస్ లో ధర్నా చేసినా, నిరసన తెలిపినా 20 వేల నుండి 30 వేల వరకు జరిమానా విధిస్తారు. ఏదైనా హింసాత్మక సంఘటనకు పాల్పడితే అడ్మిషన్ రద్దు చేస్తారు.

జేఎన్ యూ ప్రాంగణాన్ని బ్లాక్ చేయడం, జూదం ఆడటం, హాస్టల్ గదులను అనధికారికంగా ఆక్రమించడం, అవమానకరమైన పదజాలం ఉపయోగించడం, ఫోర్జరీ చేయడం వంటి 17 నేరాలకు విధించే శిక్షలను JNU యాజమాన్య‍ ప్రకటించింది. ఈ నిబంధనలు పార్ట్ టైమ్ విద్యార్థులు సహా అందరికీ వర్తిస్తాయని పేర్కొంది.

ఈ నిబంధనలపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ నిబందనలు వాక్ సభా స్వాతంత్య్రాలకు వ్యతిరేకమని, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను తాము అనుమతించబోమని వామపక్ష విద్యార్థి సంఘాలు మండిపడగా, ఇది JNU అడ్మినిస్ట్రేషన్ తుగ్లక్ చర్య అని ఏబీవీపీ ధ్వజమెత్తింది.

ఈ అంశంపై JNU వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ డి పండిట్ స్పందన కోసం మీడియా ప్రయత్నించగా ఆమె స్పందించలేదు.

Tags:    
Advertisement

Similar News